Chandrababu Naidu On Andhra Pradesh Special Statusఎవరు ఒప్పుకున్నా, లేకున్నా “ప్రత్యేక హోదా” అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముగిసిపోయిన అధ్యాయం. ప్రజలు కూడా ఈ ‘స్పెషల్ స్టేటస్’ అంశం గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేసారు. ‘ప్రత్యేక హోదా’ అన్నది కేవలం రాజకీయ లబ్ది కోసం వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయి తప్ప, ఇందులో ఆయా పార్టీల చిత్తశుద్ధి కూడా లేదన్న విషయం తేటతెల్లమైంది. ముఖ్యంగా ఈ ‘స్పెషల్ స్టేటస్’ అంశం చుట్టూనే జగన్ రాజకీయాలు చేస్తుండడం, ప్రతిపక్ష నేతగా జగన్ పరిపక్వతను ప్రశ్నార్ధకం చేస్తోంది.

ఇంకా చెప్పాలంటే… ‘ప్రత్యేక హోదా’పై రాజకీయం చేస్తే… అది తిరిగి బూమ్ రంగ్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి తప్ప, అది ప్రజల్లోకి బలంగా వెళ్ళేలా లేదన్నది స్పష్టం. కొన్ని సాంకేతిక కారణాల వలన ‘ప్రత్యేక హోదా’ను ఇవ్వలేమని కేంద్రం చెప్పిన దరిమిలా, ‘ప్రత్యేక ప్యాకేజ్’కు అంగీకరించాల్సి వచ్చిందని, తాజాగా దీనికి చట్టబద్ధత కూడా రావడంతో, ఖచ్చితంగా ఏపీకి న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి తాజాగా గుంటూరు జిల్లా, గొల్లపాడులో జరిగిన విద్యార్ధుల ముఖాముఖిలో ప్రస్తావించారు.

అయితే ఇంత చేస్తున్నప్పటికీ, జగన్ పార్టీ మాత్రం ఇంకా ‘స్పెషల్ స్టేటస్’ అంటూ రాజకీయాలు చేస్తున్నారని, అలాగే ‘ప్రత్యేక హోదా’ వస్తే పరిశ్రమలకు ‘స్పెషల్ ఇన్సెంటివ్స్’ వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తానూ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ‘ఎకనామిక్స్’ చదివానని, మరి ప్రతిపక్ష నేతలు ఎక్కడ ఏం చదివారో తనకు తెలియదని పంచ్ వేయడంతో… ఆడిటోరియంలో ఉన్న విద్యార్థి లోకం ఒక్కసారిగా చిరునవ్వులు చిందించారు. ఇటీవల ‘బికాం’లో ఫిజిక్స్ అంశం హాట్ టాపిక్ అవ్వడంతో, చంద్రబాబు వేసిక ‘ఎకనామిక్స్’ పంచ్ యువతరానికి బాగా కనెక్ట్ అయ్యింది.

అసలు ఏ రూల్స్ క్రింద పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ వస్తాయో ప్రతిపక్షాన్ని చెప్పాల్సిందిగా చాలాసార్లు అడిగితే, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదని ఎద్దేవా చేసారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఏ ఏ నిబంధనల ప్రకారం స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తాయో చెప్తే, దానిపై కేంద్రంతో పోరాడడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ‘జగన్ అండ్ కో’ను డిఫెన్స్ లో నెట్టారు. చంద్రబాబు చేసిన ఈ ప్రసంగానికి విద్యార్ధుల నుండి మంచి స్పందన రావడంతో పార్టీ వర్గాలు ఉత్సాహంలో ఉన్నాయి.