Chandrababu naidu on 2000 Rupees note Banపెద్ద నోట్ల రద్దు వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారో, లేదో పక్కన పెడితే… సదరు నోట్లను రద్దు చేయాలన్న మాట మాత్రం చంద్రబాబు నోటి వెంట పలు సందర్భాలలో రావడంతో… సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారారు. ఈ అంశంలో చంద్రబాబు ఎంతలా హైలైట్ అయ్యారంటే… కేంద్రం నియమించే అయిదుగురు ముఖ్యమంత్రుల కమిటికి చంద్రబాబు నేతృత్వం వహించేటంత! అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోటును రద్దు చేయాలని చంద్రబాబు వెనువెంటనే స్పందించారు.

ఇలా చంద్రబాబును పక్కనపెడితే, ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత తన స్వరంలో మార్పు తెచ్చుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 2000 రూపాయల నోటు రద్దుపై ప్రస్తావించారు. ఏ సమయంలోనైనా 2 వేల రూపాయల నోటు రద్దవుతుందని, ప్రధాని భేటీ తర్వాత కేసీఆర్ కూడా ప్రస్తావించడం అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటే త్వరలోనే ఖచ్చితంగా ఈ కొత్త 2 వేల రూపాయల నోటు కూడా రద్దవుతుందన్న సంకేతాలు స్పష్టమయ్యాయి. అయితే దీనికి ముహూర్తం ఎప్పుడు? దానికే సమాధానం లభిస్తోంది.

ప్రస్తుతం ఉన్న ప్రణాళికలన్నీ కార్యరూపం దాలిస్తే… 2017 జూన్ లో కొత్త 2000 రూపాయల నోటు రద్దును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇండియాను ‘క్యాష్ లెస్’గా మార్చేందుకే ఈ కీలక నిర్ణయమని ఈ నోటు రద్దు వెనుక ఉన్న అసలు ఆంతర్యంగా చెప్తున్నారు. అందులో భాగంగానే దేశంలో ప్రస్తుతం ముద్రణ చేస్తున్న 4 ప్రింటింగ్ ప్రెస్ లలో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే 2000 రూపాయల నోటు ముద్రణ జరుగుతుండగా, మిగతా మూడింటిలో 500 రూపాయల నోట్లు ముద్రణ జరుగుతోంది.

ప్రస్తుతం అమలులోకి వచ్చిన 2000 రూపాయల నోట్ల మొత్తం విలువైన కరెన్సీని ముందుగా ముద్రించకుండా, సదరు నోటు రద్దయిన తర్వాత మాత్రమే ముద్రణ ప్రారంభించే విధంగా చేసినట్లయితే మరికొంత నల్లధనం వెలికితీసే అవకాశం ఉంటుందని ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. అయితే 500, 1000 నోట్ల విషయంలో ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా రద్దు చేసిన ప్రభుత్వం, 2000 రూపాయల నోటుపై మాత్రం అందరికీ ముందస్తు సంకేతాలను ఇస్తోంది.