Chandrababu Naidu not going to YS Jagan Oath Takingతెలుగుదేశం పార్టీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కాసేపటి క్రితం సమావేశమై చంద్రబాబుని తమ నేతగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో జగన్ చంద్రబాబుకు ఫోన్ చేసి ప్రమాణస్వీకారానికి పిలిచిన దానిపై చర్చ జరిగింది. జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు వెళ్లకూడదని నిర్ణయించిన టీడీఎల్పీ నిర్ణయం తీసుకుంది. గురువారం ఉదయం జగన్‌ నివాసానికి ఇద్దరు టీడీపీ నేతలు వెళ్లనున్నారు. జగన్‌కు ఈ బృందం శుభాకాంక్షలు తెలిపే లేఖని ఇవ్వనుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించడం, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి జగన్ ఆహ్వానించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారట. దీనితో చంద్రబాబు వెళ్లకపోవడమే మేలనే అభిప్రాయాన్ని టీడీఎల్పీ భేటీలో పాల్గొన్న మెజార్టీ నేతలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కూడా ఆహ్వానించినప్పటికీ అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ హాజరుకాలేదు.

ఇదిలా ఉంటే.. జగన్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ హాజరవుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కోసం పని చేసిన ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారం కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తాడేపల్లిలోని ఇంటి నుంచీ స్టేడియం వరకూ ఓపెన్ టాప్ వాహనంలో జగన్‌ వస్తారని తెలిసింది.