Chandrababu Naidu no alliance with congress in andhra pradeshతెలంగాణలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌, టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పొత్తు పెట్టుకునే అవకాశాలు కన్పించడంలేదు. ఇరు పార్టీల అధినేతలు – చంద్రబాబు నాయుడు, రాహుల్‌ గాంధీ ఈ మేరకు తమ పార్టీల నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. రాష్ట్రాల్లో విడిగా పోటీ చేసినా దేశ ప్రయోజనాల కోసం కేంద్రంలో బీజేపీకు వ్యతిరేకంగా కలిసి నడవాలని నిర్ణయానికి వచ్చారు. ఇటీవలే ఢిల్లీలో రాహుల్‌ గాంధీని కలిసి చంద్రబాబు దీనిపైనే చర్చించినట్టు సమాచారం.

కేంద్రంలో బీజేపీని దింపడం ఎంత కీలకమో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం కూడా అంతే కీలకమని రాహుల్ అభిప్రాయపడ్డారట. రాష్ట్రంలో ఉపయోగపడుతుందని అనుకుంటేనే పొత్తుకు వెళ్లాలని రాహుల్ చెప్పారట. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల బట్టి పొత్తు కష్టమని చంద్రబాబు ఆయనకు చెప్పేశారట. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం అని రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇప్పటికే ప్రకటించడంతో జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ కు మద్దతు ఉంటుందని పార్టీ నాయకులకు చంద్రబాబు చెప్పారట.

కాంగ్రెస్‌ వ్యతిరేక విధానాల నుంచి పుట్టిన పార్టీ అయినందున రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంటే టీడీపీకు ఇబ్బంది అవుతుందేమోనన్నది పార్టీ వర్గాలకు ముందు నుండీ అనుమానమే. ఇటీవలే జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూడా ఆ రకంగానే వచ్చాయి. ఈ క్రమంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ కాంగ్రెస్ కలిసి వెళ్తాయా విడివిడిగా పోటీ చేస్తాయా అనేది కూడా చూడాల్సి ఉంది. 1996 – 1998 మధ్యలో టీడీపీ వేరే పార్టీలతో కలిపి ఏర్పాటు చేసిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ బయట నుండి మద్దతు ఇచ్చింది.

అప్పట్లో చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నారు. జాతీయ స్థాయిలో కలిసి పనిచేసినా రాష్ట్రంలో మాత్రం రెండు పార్టీలు దాయాదులుగానే ఉండిపోయారు. ఒక రకంగా అదే ప్రయోగం చంద్రబాబు మళ్ళీ చేస్తున్నట్టుగా ఉంది. 22 ఏళ్ల నాటి ప్రయోగాన్నే చంద్రబాబు మరో సారి చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో నామమాత్రంగానే ఉంది. ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ మరోసారి సున్నా సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృతాపరాధమే కదా