Chandrababu Naidu - Niti Aayogఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీతి ఆయోగ్ మీటింగు దగ్గర ప్రధానమంత్రి నరేంద్రమోడీకి నవ్వుతూ కరచాలనం చేశారు. అయితే ఒక్కసారిగా మీటింగు మొదలయ్యాక గంభీరంగా మారిపోయారు. రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ కేంద్రం వైఖరిని చంద్రబాబు ఎండగట్టారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందని పేర్కొన్నారు.

విభజన చట్టంలోని అంశాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులు సమకూర్చాలని అడిగారు. పోలవరం భూసేకరణ, పునరావస కల్పనకు కావాల్సిన నిధులను కోరారు. రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చాలని.. రెవెన్యూలోటు విషయంలోనూ అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు జీఎస్టీ విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. స్థానికంగా పన్నులు విధించే వెసులుబాటు లేకుండా పోయిందన్నారు.

నోట్ల రద్దు అనంతరం నగదు కొరత సమస్యను కేంద్రం ఇంకా పరిష్కరించలేదని విమర్శించారు. ఏపీకి రైల్వే జోన్‌ ఇస్తామని ప్రకటించి.. ఇప్పటివరకరూ ఆ హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. మిగతా రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ ఏపీకి చేయూత నివ్వాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి పదేళ్లపాటు హోదా కావాలని ఆరోజు అడిగింది భాజపా నేతలేనని గుర్తుచేశారు.