Chandrababu Naidu - Nara Lokesh -politics- (2)మంత్రి నారా లోకేష్ తన మొట్టమొదటి ఎన్నికలను ఎక్కడ నుండి ఎదురుకొంటారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఉన్న వార్తల ప్రకారం ఆయన విశాఖ ఉత్తరం నుండి గానీ మంగళగిరి నుండి గానీ పోటీ చేస్తారని తెలుస్తోంది. విశేషం ఏమిటంటే ఈ రెండు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ తేలికగా గెలిచేస్తది అని చెప్పగల్గిన నియోజకవర్గాలు కాదు. రెండు చోట్లా లోకేష్ సామాజిక వర్గ ఓటర్లు అతితక్కువగా ఉంటారు. 2014లో విశాఖ ఉత్తరాన్ని బీజేపీకి కేటాయించారు. మంగళగిరిలో టీడీపీ స్వల్ప తేడాతో ఓడిపోయింది.

అసలు అప్పట్లో మంగళగిరి లో టీడీపీ ఆ మాత్రం ప్రభావం చూపించిందంటే అందరికీ ఆశ్చర్యమే. ఈ క్రమంలో లోకేష్ ఈ రెండు చోట్లలో ఎక్కడో అక్కడ పోటీ అంటే అది ఇబ్బంది అనే చెప్పుకోవాలి. రాజకీయ నాయకులు తమ వారసులను రాజకీయాలలోకి తీసుకుని రావాలంటే వారికి బాగా తేలికగా ఉండే చోటు నుండి తీసుకుని వస్తారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో పూర్తి విరుద్దంగా లోకేష్ రాజకీయ జీవితం తో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ ను ఎమ్మెల్సీ గా మంత్రిని చెయ్యడంతో విపక్షాల విమర్శలు ఎదురుకోవాల్సిన పరిస్థితి.

ఒక వేళ లోకేష్ ఓడిపోవడం అంటూ జరిగితే అది ఆయన రాజకీయ చరిత్రలో మచ్చ గా మిగిలిపోతుంది. లోకేష్ విశాఖ ఉత్తరం నుండి పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తంగా ఉత్తరాంద్ర మీద ఉంటుందని చంద్రబాబు నాయుడు అంచనా. రాజధానికి దగ్గరగా ఉండే మంగళగిరికి ఇప్పుడు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. అది తెలుగుదేశం కిందే, అదీ తమ కుటుంబం లొనే ఉంటే చాలా మంచిదని చంద్రబాబు అభిప్రాయం. దీనితో ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ ను కుప్పం పంపి ఈ ప్రయోగాలు చంద్రబాబు తన మీద తాను చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం, తక్కువ రిస్క్ ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. రేపు తెలుగుదేశం మొదటి అభ్యర్థుల జాబితాలో లోకేష్ ఎక్కడ నుండి పోటీ చేస్తారు అనే దానిపై స్పష్టత రావొచ్చు.