Chandrababu Naidu meets with YS Jagan Victimsవైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులను సంఘటితం చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ నేతలతో ఆయన ఈరోజు తొలిసారిగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో మూడున్నర నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ఆస్తుల ధ్వంసం, భూముల కబ్జాలు, సామూహిక దాడులు, వేధింపులు, అక్రమ కేసులకు లెక్కేలేదన్నారు.

ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు అందరికి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో నివసించే హక్కును ఎవరూ కాలరాయలేరని.. ఆస్తులకు, ప్రాణాలకు భద్రత కల్పించాల్సింది పోలీసులేనన్నారు. అధికార పార్టీ బాదితులందరినీ ఒక్క చోటకు చేర్చి గుంటూరులో శిబిరం నిర్వహించడానికి టీడీపీ సిద్ధం అవుతుంది. బాధితులంతా గుంటూరు శిబిరానికి తరలి రావాలన్నారు. అవసరమైతే తానే స్వయంగా బాధితులను వాళ్ల గ్రామాలకు తీసుకుని వెళతానన్నారు.

జిల్లా పార్టీ నాయకులు అందరిని సమన్వయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఎదురుకోవడానికి చంద్రబాబు మరో వినూతన ప్రయోగం చేపట్టారనే చెప్పుకోవాలి. బాధిత శ్రేణులకు, వారి కుటుంబాలకు ధైర్యం నింపడం ద్వారా పార్టీని తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. ఘోర పరాజయం, ఆ తరువాత అధికార పార్టీ అఘాయిత్యాలతో ఇబ్బంది పడుతున్న క్యాడర్ ను ఈ ప్రయోగం ద్వారా సంఘటితం చెయ్యగలరా అనేది చూడాలి.