Chandrababu Naidu  Meets Pawan Kalyan At Novatel Vijayawadaవైసీపీ వ్యూహకర్త సిఎం జగన్మోహన్ రెడ్డా లేక విజయసాయి రెడ్డా మరొకరో తెలీదు కానీ వారి వ్యూహాలు తరచూ బెడిసికొడుతూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనలు మళ్ళీ చేతులు కలిపితే తమకు ఎదురీత తప్పదని ముందే గ్రహించి, ఆ రెండు పార్టీలకు ఆ ఆలోచన చేయకమునుపే వారి మద్య రహస్య ఒప్పందం ఉందని గట్టిగా చెప్పడానికి పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు నాయుడి ‘దత్తపుత్రుడని’ ఓ పాయింట్ తీసుకొని పదేపదే విమర్శించడం మొదలుపెట్టారు. అంతవరకు సీట్ల సర్దుబాట్లు కష్టమనే భావనతో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను, వైసీపీ నేతల ఈ ఆరోపణలు ఆలోచింపజేసేలా జేశాయి. ఏదోవిదంగా కాస్త సర్దుబాటు చేసుకొని పొత్తులు పెట్టుకొంటే ఎలా ఉంటుందని ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే టిడిపి, జనసేనలు కలవకుండా దూరం చేయాలనుకొంటే వాటిని వైసీపీ నేతలే దగ్గర చేసినట్లు అర్దం అవుతోంది.

తాజాగా విశాఖలో జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేసి, పవన్‌ కళ్యాణ్‌ని హోటల్‌ గదిలో నుంచి బయటకు వెళ్ళనీయకుండా పోలీసులు వేదించడంతో సహనం కోల్పోయి నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో వారిపై నిప్పులు చెరిగారు. విశాఖలో పవన్‌ కళ్యాణ్‌ను పోలీసులు ఇంతగా వేదిస్తున్నా జనసేనకు మిత్రపక్షంగా ఉన్న బిజెపి నేతలు గట్టిగా ఖండించలేదు కనీసం ఇది అప్రజాస్వామికమని గొంతెత్తి మాట్లాడలేదు. కానీ పవన్‌ కళ్యాణ్‌కు, పార్టీ కార్యకర్తలకు జరిగిన అవమానాలపై, చేదు అనుభవాలపట్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు.

విజయవాడలో పవన్‌ కళ్యాణ్‌ బస చేసిన నోవా టెల్ హోటల్‌కు ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌తో పాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్ కూడా చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

ఒకవేళ వారి భేటీలో రెండు పార్టీల మద్య పొత్తులపై కూడా చర్చ జరిగితే అతి త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత లభిస్తుంది. నిజానికి రెండు పార్టీలు కూడా పొత్తుల విషయంలో తొందరపడకూడదనే ఇంతకాలంగా దూరంగా ఉండిపోయాయి. కానీ వాటిని ఇంకా దూరం చేయాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలతో వారు అతిత్వరలోనే పొత్తులను ఖరారు చేసుకొని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే వారిని దూరంగా ఉంచాలనే వైసీపీ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టిందని స్పష్టం అవుతుంది. పైగా ఎప్పుడో మరో ఏడాది తర్వాత చేతులు కలపాలనుకొన్న ఆ రెండు పార్టీలను ఇప్పుడే దగ్గర చేసి కలిసి పనిచేసేలా చేసినట్లయింది. టిడిపి, జనసేనలనువేర్వేరుగా ఎదుర్కోవడానికి వైసీపీ ముప్పతిప్పలు పడుతోంది. ఇప్పుడు వాటిని స్వయంగా దగ్గర చేసి ఆ రెండు పార్టీలను ఎదుర్కోవలసిన దుస్థితి కల్పించుకొంది.