Jr NTR - Chandrababu Naidu - nandamuri kalyan ram-ఈ రోజు ఎన్టీఆర్ కుమారుడు, సినీనటుడు, టీడీపీ నాయకుడైన నందమూరి హరికృష్ణ సంవత్సరీకం. గతేడాది హరికృష్ణ ఇదే సమయంలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన సంవత్సరీకం కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో తన బావమరిది నందమూరి హరికృష్ణ సంవత్సరీకం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరికృష్ణ నివాసంలో ఆయనకు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సాదరంగా స్వాగతం పలికారు.

హరికృష్ణ తనయులతో ఆత్మీయంగా మసలుకున్న చంద్రబాబు వారితో కరచాలనం చేసి ఆ తరువాత కుటుంబ విషయాలు చర్చించినట్టు తెలిసింది. అంతకుముందు హరికృష్ణ చిత్రపటం వద్ద ఆయన నివాళులు అర్పించారు. ఇటీవలే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తరువాత ఎన్టీఆర్ చంద్రబాబు కలవడం ఇదే తొలిసారి. 2009 ఎన్నికలలో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఆ తరువాత జరిగిన పరిణామాల వల్ల పార్టీకి దూరం అయ్యారు. 2014, 2019 ఎన్నికలలో కూడా పార్టీకి దూరంగా నే ఉంటూ వచ్చారు.

2018 తెలంగాణ ఎన్నికలలో స్వయంగా హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేసినా ఎన్టీఆర్ ప్రచారం చెయ్యలేదు. ఏదో ట్విట్టర్ లో మాట సాయం చేసి సరిపెట్టారు. కుటుంబ కార్యక్రమాలలో తప్ప చంద్రబాబు నాయుడు ను కలిసిన సందర్భాలు ఉండటం లేదు. అయితే జూనియర్ అభిమానులు మాత్రం ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉండటంతో ఎన్టీఆర్ పార్టీని హస్తగతం చేసుకోవడానికే ఇదే సరైన సమయం అని అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతానికి సినిమాలే తనకు ముఖ్యమని చాలా సార్లు చెప్పాడు.