chandrababu naidu meeting with party leadersఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులలో క్రమంగా మార్పు వస్తుండటంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు నిన్న దిశా నిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై వారితో ఆన్‌లైన్‌లో సమావేశమైనప్పుడు, చంద్రబాబు నాయుడు వారికి చాలా ముఖ్యమైన సూచన చేశారు.

సాధారణంగా ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలుపెట్టడానికి ప్రయత్నించినప్పుడే పార్టీలో నేతల మద్య కీచులాటలు మొదలవుతాయని, కనుక టిడిపిలో అందరూ ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితం కావాలని చంద్రబాబు నాయుడు సూచించారు. పొరుగు నియోజకవర్గాలలో వేలు పెట్టే బదులు తమ సొంత నియోజకవర్గాలలో తమ బలం పెంచుకోగలిగితే దాంతో పార్టీ కూడా బలోపేతం అవుతుందని సూచించారు.

ఒకవేళ ఇరుగు పొరుగు నియోజకవర్గాలలో తమకు పరిచయాలు, పరపతి, బంధుమిత్రులు, వ్యాపారలావాదేవీలు ఉన్నట్లయితే వాటి వరకే పరిమితం కావాలి తప్ప పొరుగు నియోజకవర్గాలలో వేలు పెట్టవద్దని చంద్రబాబు నాయుడు సూచించారు. పార్టీలో నేతలందరూ ఈవిదంగా క్రమశిక్షణ, నిర్ధిష్టమైన లక్ష్యంతో పనిచేసినట్లయితే వచ్చే శాసనసభ ఎన్నికలలో టిడిపి అలవోకగా భారీ మెజార్టీ సాధించి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.

వైసీపీకి వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదని సిఎం జగన్మోహన్ రెడ్డి గ్రహించినందునే 175 సీట్లు లక్ష్యం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ మూడేళ్ళ జగన్ పిచ్చి పాలన, పిచ్చి నిర్ణయాలు, పన్నులు, ఛార్జీల మోతతో రాష్ట్ర ప్రజలందరూ విసుగెత్తిపోయున్నారని, కనుక ఆయనను ఎప్పుడు గద్దె దించుదామా… అని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు. కనుక టిడిపిలో అందరూ ఈ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకొని ప్రజలతో మమేకం అయ్యి పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేయాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.