chandrababu-naidu-marriage-no-dowryతన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పుడూ ప్రస్తావించని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తొలిసారిగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చెప్పిన ఈ సంగతులలో…

ఎన్టీఆర్ కుమార్తెతో వివాహం సమయంలో తాము ఎలాంటి కట్నం అడగలేదని, అలాగే ఎన్టీఆర్ కూడా ఇవ్వలేదని తెలిపారు. అయితే చెన్నైలో తమ వివాహాన్ని చాలా ఘనంగా జరిపించారని, దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తాను చాలా ఆవేశంగా ఉండేవాడినని గతాన్ని స్మరించుకున్నారు చంద్రబాబు.

అయితే అంతకు ముందు అవగాహనా రాహిత్యం కారణంగా 23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తాను అప్పట్లో సిద్ధమయ్యానని, ఆ తరువాతే తనకు ఎమ్మెల్సీ అయ్యేందుకు ఆ వయసు సరిపోదని తెలిసిందని అన్నారు. 28 ఏళ్ల వయసులో తాను ఎమ్మెల్యే అయ్యానని, అపుడు నేరుగా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వద్దకు వెళ్లి, తనను కేబినెట్ లోకి తీసుకోవాలని కోరానని గుర్తుచేసుకున్నారు. ‘నువ్వింకా యంగ్ ఎమ్మెల్యేవి. అప్పుడే మంత్రి పదవి అడుగుతున్నావా?’ అన్నారని, అయితే ఆ తరువాత అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన కేబినెట్ లో స్థానం కల్పించారని తన రాజకీయ ప్రస్థానం తొలినాళ్ళల్లోని మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు.