Chandrababu naidu pledgeకొత్త రాష్ట్రం తెలంగాణలో ఆవిర్భావ వేడుకలకు రంగం సిద్ధమవగా… తెలంగాణ ఏర్పాటుతో తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఏపీ నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుట్టనుంది. ఉదయం 11 గంటలకు నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలోని బెంజిసర్కిల్ లో నవ నిర్మాణ దీక్షలకు తొలి అడుగు పడనుంది. దీక్షల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించనున్నారు.

నేడు ప్రారంభమయ్యే దీక్షలు ఈ నెల 8న ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో జరగనున్న ‘మహా సంకల్ప సభ’తో ముగియనున్నాయి. ఈ ఏడు రోజుల పాటు నవ నిర్మాణ దీక్షల్లో ప్రతి రోజూ ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. సమస్యల్లో చిక్కుకున్న ఏపీని పునర్మించుకుందామంటూ చంద్రబాబు ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నారు. ‘అవినీతిపై పోరు’తో మొదలయ్యే ఈ ప్రతిజ్ఞ ‘లక్ష్యాలను సాధిద్దామన్న’ పిలుపుతో ముగియనుంది.

అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని “మన కష్టం”తో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవులం మనం. ప్రతి సంక్షోభాన్నీ ఓ అవకాశంగా మలచుకుందాం. దేశ భక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.

అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికి ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షా లక్ష్యాలను సాధిద్దాం… అంటూ ప్రజలతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించనున్నారు.