టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టిడిఎల్పీ సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారని అందుకే వారికే మళ్ళీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. టికెట్స్ ఖరారు చేసినందున అందరూ తమ తమ నియోజకవర్గాలలో ఇప్పటి నుంచే పట్టు పెంచుకొని వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు గట్టిగా కృషి చేయాలని సూచించారు. తమలాగే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇవ్వగలమని ప్రకటించే ధైర్యం సిఎం జగన్మోహన్ రెడ్డికి ఉందా?అని సవాల్ కూడా విసిరారు.
టిడిపిలో చంద్రబాబు నాయుడుతో కలిపి మొత్తం 23మంది ఎమ్మెల్యేలున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలలో కొంతమందికి టికెట్లు ఖరారు చేశారు. త్వరలో మరింతమందికి ఖరారు చేయడం ఖాయం. అంటే 175 స్థానాలలో దాదాపు 50-60 స్థానాలకు అతి త్వరలోనే అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ఉందని భావించవచ్చు.
Also Read – రాజకీయాలకు కూడా వాలంటరీ రిటైర్మెంటే నా.?
జనసేన, బిజెపిలు టిడిపితో పొత్తులు పెట్టుకొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలు పంపుతుండగానే చంద్రబాబు నాయుడు పార్టీలో అభ్యర్ధులకు టికెట్లు ఖరారు చేస్తుండటం గమనిస్తే, పొత్తుల విషయంలో ఆయన తొందర పడదలచుకోలేదని లేదా వాటికి ఆసక్తి ఉన్నట్లయితే ఇప్పుడే సీట్ల సర్దుబాట్లపై చర్చించడం మంచిదనే సంకేతం పంపుతున్నట్లు కూడా భావించవచ్చు.
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఖరారు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత మీద, ఆ పార్టీ ఎమ్మెల్యేల మీద తీవ్ర ఒత్తిడి సృష్టించగలుగుతారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనీసం 60-70 మందిని మార్చక తప్పదని ప్రశాంత్ కిషోర్ బృందం నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. జగన్ సొంత సర్వేలో కూడా కనీసం 50-60 మంది పనితీరుబాగోలేదని తేలింది. కనుక పనితీరు మెరుగు పరుచుకోకపోతే వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఆశించవద్దని సిఎం జగన్ ఖరాఖండీగా చెపుతున్నారు. దీంతో వారు చాలా ఆందోళన చెందుతున్నారు.
Also Read – జగన్ మావయ్యా… నారా లోకేష్‌ని నేర్చుకో!
ఇప్పుడు టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్స్ ఖరారు చేస్తున్నట్లు ప్రకటించి, సిఎం జగన్‌కు కూడా చంద్రబాబు నాయుడు సవాల్ విసరడంతో వైసీపీ ఎమ్మెల్యేలలో ఆందోళన ఇంకా పెరుగుతుందని వేరే చెప్పక్కరలేదు. పనితీరు బాగోలేదని చెప్పబడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ అధినేతను తమకు టికెట్లు ఖరారు చేయమని ఒత్తిడి చేయడం ప్రారంభిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక చంద్రబాబు నాయుడు చేసిన ఈ తాజా ప్రకటన ఆయన రాజకీయ చతురతకి అద్దం పడుతోందని చెప్పవచ్చు. దీని పరిణామాలు ఏవిదంగా ఉంటాయో రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలు కూడా చూడగలుగుతారు.