Kodandaram to Contest from Jangaon?తెరాసతో కలిసి ప్రజాపోరాటాలు చేసి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్. తరువాతి కాలంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా మారి సొంత పార్టీ పెట్టి మహాకూటమితో కలిసి పని చేస్తున్నారు. అయితే పార్టీల సొంత విధానాలకు, ప్రజాకూటమి ఎజెండాకు సంబంధం లేదని తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ అంటున్నారు. టీడీపీ మహాకూటమిలో భాగస్వామి అయినా తాను ఇప్పటికీ చంద్రబాబుకు దూరమే అని అంటున్నారు ఆయన. ఒకవైపు టీడీపీతో పొత్తు పెట్టుకుంటూ చంద్రబాబుకు దూరం అంటే నమ్మే పరిస్థితి ఉందా ఆచార్యా?

ఒక ఇంటర్వ్యూలో ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబు అంశం టీడీపీ వ్యవహారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యమ ఆకాంక్షల అమలు ఎజెండాకు టీటీడీపీ నేతలు అంగీకరించారని, అందుకే వారితో పొత్తు పెట్టుకున్నట్లు అయన చెప్పుకొచ్చారు. అయినా తాము చంద్రబాబుతో మాట్లాడటం లేదని, టీటీడీపీ నేతలతోనే మాట్లాడుతున్నామని కోదండరామ్ అనడం విశేషం. వారంతా తెలంగాణ వారే అని వారికి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని తాము నమ్ముతున్నామని ఆయన అంటున్నారు.

కనీసం ఒక పార్లమెంట్ నియోజకవరానికి ఒక సీటులో పోటీ చేద్దామన్న కుదరలేదు. ఒక దశలో కోదండరామ్ ఈ ఎన్నికలలో పోటీ చెయ్యాలని భావించినా పొత్తు కోసం తన సొంత సీటును కూడా త్యాగం చెయ్యాల్సి వచ్చింది. పొత్తుల్లో భాగంగా తాము నష్టపోయినా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే పొత్తుకు అంగీకరించామన్నారు. సీట్లు తక్కువగా వచ్చినందుకు బాధ ఉండటం సహజమని, సీట్లు రాని వారికి అసంతృప్తి ఉంటుందన్నారు. అయితే సీట్లు లభించిన అభ్యర్థులే అసంతృప్తులను సమన్వయం చేసుకోవాలన్నారు.