Chandrababu-Naidu-Khamamటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళ తర్వాత నేడు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం పట్టణంలో బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకి జూబ్లీహిల్స్‌లో తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకి ఖమ్మం చేరుకొంటారు. ఖమ్మంలో మయూరీ జంక్షన్ నుంచి బహిరంగసభ జరుగబోయే సర్దార్ పటేల్ స్టేడియంకి ర్యాలీగా చేరుకొంటారు.

సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు సభలో పాల్గొని చింతకానికి చేరుకొంటారు. అక్కడ ఆయన సమక్షంలో కొందరు టిడిపిలో చేరుతారు. అక్కడి నుంచి విజయవాడ మీదుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకొంటారు. దారిలో కొన్ని చోట్ల ఎన్టీఆర్‌ విగ్రహాలని ఆవిష్కరించి నివాళులు ఆర్పిస్తారు.

ఇటీవల తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగాబీసీ సంఘాల నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో మళ్ళీ టిడిపిని బలోపేతం చేస్తానని ఆయన అప్పుడే చెప్పారు. ఆ ప్రయత్నంలోనే నేడు ఖమ్మంలో బహిరంగసభ ఏర్పాటు చేస్తుండగా దానిలో చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. రాష్ట్ర విభజనకి ముందు వరకు తెలంగాణలో టిడిపి చాలా బలంగానే ఉండేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీ సిఎంగా బిజీ అయిపోవడం, అదే సమయంలో తెలంగాణ సిఎం కేసీఆర్‌ తెలంగాణ టిడిపి నేతలను తన పార్టీలోకి ఫిరాయించుకోవడంతో టిడిపి బలహీనపడింది.

అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్‌కి ఎదురుగాలులు వీస్తూండటం, బిఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిజెపి ఎదుగుతుండటంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలలో మళ్ళీ మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నేటికీ ఖమ్మంలో టిడిపి, వైసీపీలకి కొంత బలముంది. అందుకే వైఎస్ షర్మిల కూడా ఆ జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. కనుక టిడిపి కూడా తనకి పట్టున్న ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్దం అవుతోంది.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇప్పుడు బిఆర్ఎస్‌ పార్టీతో ఏపీలో అడుగుపెట్టాలనుకొంటున్నారు కనుక చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలలో పాల్గొంటే ఆయన అభ్యంతరం చెప్పలేరు. ఒకవేళ చెపితే ఏపీలో బిఆర్ఎస్‌కి చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పే అవకాశం గలుగుతుంది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా కేసీఆర్‌ని ఓడించి తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి చాలా పట్టుదలగా ఉంది.

కనుక తెలంగాణ రాజకీయాలలో టిడిపి మళ్ళీ పట్టు సాధించినట్లయితే ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఏర్పడుతుంది. బహుశః ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు నాయుడు ఈరోజు ఖమ్మంలో బహిరంగసభకి సిద్దం అవుతున్నట్లు భావించవచ్చు. అయితే ఈ సభలో ఆయన కేవలం టిడిపిని బలోపేతం చేసుకోవడం గురించి మాత్రమే మాట్లాడుతారా లేక కేసీఆర్‌, ఆయన ప్రభుత్వం, బిఆర్ఎస్‌ పార్టీలపై విమర్శలు గుప్పిస్తారా?అనే దానిని బట్టి భవిష్యత్‌ కార్యాచరణపై కొంత స్పష్టత రావచ్చు.