Chandrababu-Naidu-KCRరాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ సిఎం కేసీఆర్‌, ఏపీ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ భిన్న వ్యూహాలు అనుసరించారు. వారిలో ఎవరిది ఫలించింది?అని ప్రశ్నించుకొంటే ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు కనుక చంద్రబాబు నాయుడి వ్యూహమే ఫలించిందని ఎవరైనా చెపుతారు. కానీ వారి వ్యూహాల వెనుక అంతకు మించి చాలానే ఉంది. దానినీ పరిశీలించక తప్పదు.

ముందుగా సిఎం కేసీఆర్‌ విషయానికి వస్తే జాతీయ రాజకీయాలలో ఆరంగ్రేటం చేయడానికి దీనిని ఆయన తొలి అవకాశంగా భావించారు. దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నిటినీ ఇదివరకే కలిసి వచ్చారు కనుక ఈ ఎన్నికలో వాటన్నిటినీ తన నాయకత్వంలో ముందు నడిపించి తన సత్తా చాటుకోవాలనుకొన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఎంట్రీతో అంతా తారుమారైంది. ఆయనే వాటికి దూరం కావలసివచ్చింది. అంతే కాదు… కాంగ్రెస్‌ లేకుండా విపక్షాలు కలిసి పనిచేయవనే విషయం కేసీఆర్‌కు స్పష్టంగా ఆర్డమైంది.

ఇక కేసీఆర్‌ ఏ ఉద్దేశ్యంతో కొడుకు కేటీఆర్‌ను యశ్వంత్ సిన్హా నామినేషన్‌కు పంపారో తెలీదు కానీ ఆ కార్యక్రమానికి రాహుల్ గాంధీ తదితరులు హాజరవడంతో కేటీఆర్‌ వెనకుండిపోవలసి వచ్చింది. అదో అవమానం. రాష్ట్రపతి ఎన్నికలలో ఓడిపోబోతున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌ వచ్చినప్పుడు, ఆయన రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచి నగరానికి తొలిసారిగా వచ్చినట్లుగా కేసీఆర్‌ చేసిన హడావుడి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. యశ్వంత్ సిన్హా ఓడిపోవడంతో రాష్ట్రంలోను, జాతీయ స్థాయిలోను బిజెపి ముందు కేసీఆర్‌ మరోసారి తలదించుకోవలసి వచ్చింది. కనుక ఈ విషయంలో ఆయన వ్యూహం బెడిసికొట్టిందనే చెప్పవచ్చు.

ఇక టిడిపి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ద్రౌపదీ ముర్ము విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు నాయుడుతో సహా అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆమెకు మద్దతు ప్రకటించి ఆమె విజయంలో టిడిపిని భాగస్వామిగా చేశారు.

ఆమె విజయవాడ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుని కలవకుండా చేయాలని జగన్ చేసిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. పైగా జగన్ ఏది జరగకూడదని భయపడుతున్నారో అదే జరిగింది. ఆమె గౌరవార్ధం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఆత్మీయసమావేశానికి సోము వీర్రాజుతో రాష్ట్రంలో బిజెపి ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. వారూ, చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా పలకరించుకొన్నారు. దీంతో రాబోయే ఎన్నికలలో మళ్ళీ టిడిపి, బిజెపిలు కలిసి పనిచేసే అవకాశం ఉందనే సంకేతం పంపినట్లయింది.

ఒకవేళ టిడిపి, బిజెపిలు కలిసి పనిచేయకపోయినా ద్రౌపదీ ముర్ముకి మద్దతు తెలుపడం ద్వారా, ఈ సమావేశంలో బిజెపి నేతలతో ఆప్యాయంగా మాట్లాడటం ద్వారా బిజెపితో తమకు శతృత్వం లేదనే విషయం స్పష్టంగా తెలియజేశారు. రాజకీయాలలో శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు ఉండరని అందరికీ తెలుసు. కనుక టిడిపి, బిజెపిలు గతాన్ని పక్కనపెట్టి వచ్చే ఎన్నికలలో కలిసి పనిచేసినా ఆశ్చర్యం లేదు. కనుక రాష్ట్రపతి ఎన్నికలో చంద్రబాబు నాయుడు అనుసరించిన వ్యూహం సరైనదేనని స్పష్టం అవుతోంది.