Chandrababu Naidu KCR-Lagadapati Rajgopalఖచ్చితమైన సర్వేలకు పెట్టింది పేరు ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. సహజంగా ఎన్నికల తరువాత తన సర్వే ఫలితాలు ప్రకటించే లగడపాటి ఈ సారి ముందే గాలి ఎటు ఉంది అనే విషయం చెప్పేశారు. మొదట ఇండిపెండెంట్ల పేర్ల తో మొదలు పెట్టిన ఆయనను ట్విట్టర్ వేదికగా రెచ్చగొట్టి ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మొత్తం చెప్పించేశారు. ఒక్క సీట్ల అంచనా తప్ప మహాకూటమికే ఈ ఎన్నికలు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీనితో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

అయితే ఓడిపోవడం గారంటీ అని తెలిసి చంద్రబాబే లగడపాటితో దొంగ సర్వే చెప్పించారని తెరాస వారి ఆరోపణ. లగడపాటి చెప్పిన దానితో ఖుషీగా ఉన్నారు మహాకూటమి శ్రేణులు. అయితే ఇంతకు లగడపాటి నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? స్వయంగా ఆయన సతీమణి తెరాస అభ్యర్థి దానం నాగేందర్ కు ప్రచారం చెయ్యడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ లగడపాటి ఇప్పుడు అబద్ధం చెప్పినా రేపు పోలింగ్ తరువాత ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి నిజమే చెప్తారు.

అప్పటికి అంతా అయిపోతుంది కాబట్టి ఆయన విశ్వసనీయతను దెబ్బ తీసుకోరు. అదే విధంగా లగడపాటి చేత చంద్రబాబు అబద్ధం చెప్పించారు అనే దాని మీద కూడా కొంత అనుమానం ఉంది. ఒకవేళ నిజంగా లగడపాటి చంద్రబాబు కంట్రోల్ లో ఉంటే ఆయనను మేలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు చంద్రబాబు వాడుకుంటారు. ఇప్పుడు ఆయన విశ్వసనీయత దెబ్బ తీస్తే అసలు సమయానికి అది చంద్రబాబుకే నష్టం. కాబట్టి చంద్రబాబు ఆ పని చేసి ఉంటారా?

ఖచ్చితమైన సర్వేలు చెప్తారు అనే పేరు, ఆంధ్ర ఆక్టోపస్ అనే బిరుదును లగడపాటి చాలా గొప్పగా తీసుకుంటారు. అందుకే ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోయినా ఆయన అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సర్వేలు చేయిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన అనవసరంగా రిస్క్ తీసుకోరు అని ఆయన గురించి తెలిసిన చాలా మంది అంటున్నారు. ఈ క్రమంలో రేపు ఓటర్లు ఏం డిసైడ్ చేస్తారు అనేదాని మీద సర్వత్రా ఆసక్తి ఉంది. 11వ తారీఖున ఫలితాలు విడుదల అయ్యాకా లగడపాటి నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అనేది తేలిపోతుంది. అలాగే వివిధ పార్టీల భవితవ్యం కూడా.