Telangana-TDPతెలంగాణలో టిడిపిని మళ్ళీ బలోపేతం చేసుకొని వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ గట్టిగానే ప్రయత్నిస్తున్నారని నిన్న ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగసభ నిరూపిస్తోంది. అంతేకాదు… తెలంగాణలో టిడిపిని కేసీఆర్‌ పూర్తిగా నిర్వీర్యం చేసినప్పటికీ పార్టీ క్యాడర్ చెక్కుచెదరలేదని నిన్నటి సభ నిరూపించింది.

తెలంగాణలో ఇంతకాలం కేసీఆర్‌ చెప్పిందే వేదం అన్నట్లు సాగుతుండేది. కానీ అందుకోసం ఆయన రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం అతిపెద్ద పొరపాటని బిజెపి ఎంట్రీతో స్పష్టం అయ్యింది. అయితే అప్పుడూ ఆయన దానిని రాష్ట్ర స్థాయిలో ఢీకొనకుండా దానిని నిలువరించే ప్రయత్నంలో కేంద్రంతో అనవసరంగా గొడవ పెట్టుకొని సరిదిద్దుకోలేని మరో తప్పు చేశారని చెప్పవచ్చు.

తెలంగాణతో టిఆర్ఎస్‌కి అనుబందం ఏర్పరచినదే టిఆర్ఎస్‌ పేరు. దానిలో తెలంగాణని తొలగించి బిఆర్ఎస్‌గా మార్చి మరో తప్పిదం చేశారని, తద్వారా కేసీఆర్‌ చేజెతులా తెలంగాణ సెంటిమెంట్‌ని వదులుకొన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కారు గుర్తును పోలిన ఎన్నికల చిహ్నాలు ఉంటేనే తమ ఓట్లు వేరేవారికి పడతాయని ఆందోళన చెందే టిఆర్ఎస్‌ నాయకులు, ఇప్పుడు తమ అధినేత కేసీఆర్‌ పార్టీ పేరే మార్చేయడంతో వచ్చే ఎన్నికలలో దీని ప్రభావం ఏవిదంగా ఉంటుందో అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక కేసీఆర్‌ జాతీయ రాజకీయాలతో తమ కొంప మునుగుతుందనే ఆందోళన కూడా వారిలో ఉంది.

ఇది బిఆర్ఎస్‌ కధ కాగా, రాష్ట్రంలో బిజెపి కధ మరోలా ఉంది. ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న పోరాటాల వలన కావచ్చు లేదా కేంద్రం ఆయనకి సహకరిస్తునందువల్ల కావచ్చు రాష్ట్రంలో బిఆర్ఎస్‌కి బిజెపి ప్రత్యామ్నాయమనే గుర్తింపు ఏర్పడింది. కానీ నేటికీ ఆ పార్టీకి రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలకి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధులు లేరు. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారిని పార్టీలోకి తెచ్చుకొంటోంది. అయినప్పటికీ వారు కేసీఆర్‌ని, బిఆర్ఎస్‌లో కొమ్ములు తిరిగిన నేతలనీ ఎదుర్కొని విజయం సాధించడం దాదాపు అసంభవమే అని చెప్పవచ్చు. కానీ వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలవకుండా బిజెపి అడ్డుకొనే అవకాశం మాత్రం ఉందని చెప్పవచ్చు.

తెలంగాణలో మారుతున్న ఈ రాజకీయ బలాబలాను చూసే ఆ రాష్ట్రంలో టిడిపిని బలోపేతం చేసుకొనేందుకు ఇదే మంచి అవకాశంగా చంద్రబాబు నాయుడు గుర్తించిన్నట్లున్నారు. అందుకే కాసాని జ్ఞానేశ్వర్‌కి పార్టీ పగ్గాలు అప్పగించగా, ఆయన వెంటనే ఖమ్మంలో ఈ బహిరంగసభని విజయవంతంగా నిర్వహించి చంద్రబాబు నాయుడు అంచనాలు నిజమే అని నిరూపించి చూపారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో మళ్ళీ టిడిపి బలపడి, 15-20 సీట్లు గెలుచుకోగలిగినా, ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించగలుగుతుంది. తెలంగాణ రాజకీయాలలో టిడిపి బలపడితే అది ఏపీలో టిడిపికి కూడా ఎంతో మేలు చేస్తుందని వేరే చెప్పక్కరలేదు.