Chandrababu -Naidu  Kapu reservation election stuntఅగ్రవర్ణాల పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇస్తూ ఇటీవలే చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు అమలు లో తమ రాష్ట్రాల అవసరాల మేరకు నిబంధనలు రూపొందించుకోవచ్చు. ఇప్పుడు దానిని వాడుకుని ఆంధ్రప్రదేశ్ లో కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్ల ప్రమాణాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మేరకు కేబినెట్ తీర్మానం కూడా చేశారు.

ఈ క్రమంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే దీనివల్ల మిగతా అగ్రవర్ణాల పేదలలో వ్యతిరేకత వస్తుందా అనేది చూడాలి. అయితే ప్రభుత్వం మాత్రం కాపులు ఆంధ్రప్రదేశ్ జనాభాలో 15% శాతం వరకు ఉంటారని, అగ్రవర్ణాల జనాభాలో వారు దాదాపుగా 50% వరకు ఉంటారని కాబట్టి వారికి 5% రిజర్వేషన్లు అనేది సమంజసమే అని చెబుతుంది.

అయితే ఇది ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలి. కాపులకు రిజర్వేషన్లు అనేది తెలుగుదేశం పార్టీ 2014 మేనిఫెస్టో లో ప్రధాన హామీలలో ఒకటి. ఇప్పటికే వారికి 5% రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం దానిని 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయనే పేరుతో పక్కన పెట్టింది. అయితే అగ్రవర్ణాల పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇస్తూ 60% రిజర్వేషన్లు చేసింది. దానికోసం రాజ్యాంగ సవరణ కూడా చేసింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది చట్ట వ్యతిరేకమని కొందరి వాదన. కోర్టులో ఇది నిలవజాలదని వారి అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది కోర్టులలో నిలుస్తుందని అభిప్రాయపడుతుంది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం గనుక ఇది చెయ్యగలిగితే ఎన్నికల ముందు కాపులను ఆకట్టుకోవడంలో పెద్ద ముందడుగు వేసినట్టే. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విధివిధానాలను అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే శాసనసభ సమావేశాలలోనే ఈ బిల్లును పెట్టి ఆమోదించాలని ప్రభుత్వం చూస్తుంది.