Chandrababu Naidu Jaganఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ జనవరితో కలిపి మొత్తం మూడు కొత్త సంవత్సరాలు చవిచూశారు జగన్ మోహన్ రెడ్డి. ప్రతి జనవరికల్లా ఆ ఏడాది జాబ్ క్యాలెండరు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో, నిరుద్యోగులంతా కొత్త ఏడాది జనవరి వైపుకు చూడడం కామన్ అయిపోయింది.

డిసెంబర్ మాసంలో పోలవరం పూర్తి చేస్తామన్న మంత్రి అనిల్ కుమార్ ను నెటిజన్లు ట్రోల్ చేసినట్లు, జనవరి మాసం వచ్చేసరికి సీఎం వంతు వస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో జాబ్ క్యాలెండరు అంశంపై అనేక మేమ్స్ నెటిజన్లను అలరిస్తున్నాయి. చివరికి ‘జనవరిలు వస్తుంటాయ్… పోతుంటాయ్…’ మనకు ఒరిగేదేమి లేదన్న భావనకు నిరుద్యోగులు వచ్చేసారు.

సీఎంగా ‘ప్రత్యేక హోదా’ అంశంపై మొదటి ఏడాదిలోనే జగన్ చేతులెత్తేయగా, రాష్ట్రానికి కీలకమైన పోలవరం నిర్మాణంలో పూర్తిగా జాప్యం జరుగుతోంది. విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ విషయాలలో ఏ మాత్రం చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోవడం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోవడం సీఎం నిస్సహాయతను సూచిస్తోంది.

ఇక వర్షాలు తగ్గిపోగానే గతుకులతో నిండిపోయిన రోడ్ల నిర్మాణం వేగవంతం చేయమన్న సీఎం ఆదేశాలు కేవలం పేపర్ కే పరిమితమయ్యాయి. వర్షాలు తగ్గిపోయాయి గానీ, రోడ్లపై గుంతల సంఖ్య మాత్రం తగ్గలేదు. పరిపాలన విషయానికి వచ్చేప్పటికి పారదర్శకత లేకుండా రహస్య జీవోలను అమలు చేయడం, గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్ర విచిత్రమైన పన్నులను అమలు చేయడం జగన్ పాలనకు మచ్చుతునకలు.

సంక్షేమ పధకాల పేరుతో పంచిపెడుతోన్న విధానాలే ఏపీ ఆర్ధికంగా వినాశనం కావడానికి కారణమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినప్పటికీ, ఎప్పటికప్పుడు అప్పులు తీసుకువస్తూ ‘ఉద్యోగస్తులకు జీతాలైనా ఆపండి గానీ, పధకాల అమలుకు మాత్రం ఎక్కడా లోటు’ ఉండరాదని సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రధాన సహకారం గత చంద్రబాబు పాలన నుండి లభిస్తోందని చెప్పవచ్చు.

నాడు దేశవిదేశాలు తిరిగి రాష్ట్రంలో భారీ సంఖ్యలో పెట్టుబడులను తీసుకువచ్చిన చంద్రబాబు నిర్ణయాలే నేడు జగన్ కు వరంలా మారాయి. అందుకే గత మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్క భారీ పరిశ్రమ నెలకొల్పకపోయినా, రాష్ట్ర ఆదాయంలో ఇబ్బందులు లేకుండా పోయాయి. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ నుండి తరలివెళ్లిన పరిశ్రమలు కూడా ఉంటే, ఏపీ స్థాయి మరోలా ఉండేదని పేర్కొనవచ్చు.

నాడు రాజధాని అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించారంటూ అవహేళన చేసిన వాళ్లే, నేడు అదే గ్రాఫిక్స్ ను చూపించి 3 వేల కోట్లు అప్పులు తెచ్చారంటే, చంద్రబాబు పాలనతో జగన్ సర్కార్ మనుగడ సాగిస్తున్నట్లే కదా! రాజధానిగా అమరావతిని ఒప్పుకోని జగన్ సర్కార్, అప్పుకు మాత్రం ‘జై అమరావతి’ అనొచ్చా? ఇందులో నిజాయితీ, నైతికత ఎక్కడ ఉంది?