chandrababu-naidu-Jaganసాధారణంగా అధికార పార్టీలు తమ పదవీకాలం పూర్తయ్యే వరకు ఎన్నికల గురించి మాట్లాడేందుకు తొందరపడవు… ఇష్టపడవు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇంకా రెండేళ్ళ సమయం ఉండగానే అప్పుడే ఎన్నికల సన్నాహాలు ప్రారంభించేసింది.

మున్ముందు అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడితే సంక్షేమ పధకాలు కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. వాటిలో కొన్నిటిని నిలిపివేసినా వైసీపీ పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇంతకాలం అప్పులు తెచ్చి పంచిపెట్టినా చివరికి ఆశించిన ఫలితం రాకపోతే నష్టపోతుంది. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన మొదలయినట్లుంది.

అందుకే పదవీ కాలం పూర్తయిన తరువాతే ఎన్నికలు అంటూనే మరోపక్క జోరుగా ఎన్నికల సన్నాహాలు చేసుకొంటోంది. సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు ఎమ్మెల్యేల వరకు అందరూ ఎన్నికలు, టికెట్లు, ప్రతిపక్షాల పొత్తుల గురించే ఎక్కువగా మాట్లాడుతుండటమే ఇందుకు నిదర్శనం.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి కూడా ఎన్నికల కోసమే ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఎన్నికల మాట వైసీపీ నేతల నోటనే వినిపిస్తుండటంతో చాలా సంతోషిస్తోంది. అయితే ఇవే వైసీపీకి చివరి ఎన్నికలని టిడిపి వాదిస్తుంటే, కాదు టిడిపికి చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలని మంత్రి పెద్దిరెడ్డి రామాచంద్రారెడ్డి వంటివారు వాదిస్తున్నారు.

కనుక వచ్చే ఎన్నికలు ఎవరికి చివరి ఎన్నికలనే ప్రశ్నకు సమాధానం వెతకవలసి ఉంది.

ఒకవేళ గత ప్రభుత్వం ప్రారంభించిన అమరావతి నిర్మాణపనులను, అలాగే పోలవరం పనులను అదే ఊపుతో కొనసాగించి పూర్తి చేస్తున్నట్లయితే ప్రజలు, మూడేళ్ళుగా సంక్షేమ పధకాలు పొందునందుకు లబ్దిదారులు తప్పకుండా జగనన్నకు మరో ఛాన్స్ ఇచ్చి ఉండేవారేమో?

ఏనాటికైనా ముఖ్యమంత్రి కావాలనే జగన్మోహన్ రెడ్డి కోరికను ఏపీ ప్రజలు నెరవేర్చినప్పుడు అందుకు కృతజ్ఞతగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ఉండాలి. కానీ మరో ఆరేళ్ళ వరకు అమరావతి పూర్తి చేయలేమని, పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని వైసీపీ మంత్రులే చెపుతున్నారు. అంటే ప్రజల ఆకాంక్షలు వారికి అర్ధం కాలేదన్న మాట!

ఒకవేళ సంక్షేమ పధకాల కారణంగా ప్రజలందరూ వైసీపీ వైపే ఉన్నట్లయితే ఆ పార్టీ అసలు ఈ ఎన్నికల హడావుడి మొదలుపెట్టి ఉండేదే కాదు కదా?కనుక పప్పు బెల్లాలు పంచుతున్నప్పటికీ తీవ్ర అభద్రతాభావంతో ఉందంటే అర్ధం వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు కావచ్చు.

ఒకవేళ వైసీపీకి ఇవి చివరి ఎన్నికలైతే సహజంగానే తెలుగుదేశం పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. టిడిపి వస్తేనే రాజధాని అమరావతి పూర్తవుతుంది. పోలవరం పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడుకి విశ్వసనీయత ఉంది కనుక రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు వస్తాయి. ప్రజలు కూడా అదే కోరుకొంటున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ టిడిపికే పట్టం కట్టవచ్చు.