chandrababu naidu increased pension scheme due to ysrcp jagan pressureఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి సందర్భంగా ప్రస్తుతం ఉన్న పెన్షన్లు అన్నీ రెట్టింపు చేస్తునట్టు ప్రకటించి ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేశారు. దాదాపుగా 54 లక్షల మందికి డైరెక్టుగా ప్రయోజనం చేకూరడంతో ఇది తెలుగుదేశం పార్టీకి ఎన్నికలలో భారీగా కలిసి వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోని జగన్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే అధికారంలో లేకపోవడంతో ఇప్పటికిప్పుడు హామీలు తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి.

ఈ క్రమంలో 2017 జూలై ఎనిమిదో తేదీన గుంటూరు వద్ద జరిగిన పార్టీ ప్లీనరీలో నవరత్నాల పేరుతో ప్రకటించిన వరాలలో ఈ పెన్షన్ పెంపు అన్నది ఒకటని కావును జగన్ ఒత్తిడితోనే పెన్షన్లు పెంచారని కాబట్టి ఈ క్రెడిట్ తమకే దక్కాలని వైకాపా వారు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క తాము పెన్షన్లు మరింత పెంచితే ఎలా ఉంటుంది అని కూడా వారు ఆలోచిస్తున్నారట. అయితే ఇప్పటికే ఇస్తున్న వాడిని కాదని అధికారంలోకి వస్తే మరింత ఎక్కువ పెన్షన్ ఇస్తామని జగన్ చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు.

రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి క్లిష్టతరంగా మారింది. మరోవైపు రుణమాఫీ చివరి రెండు వాయిదాలు ఎలా చెల్లించాలా అని ప్రభుత్వం తలపట్టుకుని ఉంది ఈ క్రమంలో ఎన్నికల ముందు కొత్త పథకాలు ప్రకటిస్తారని జగన్ అనుకోలేదు. దీనితో ప్రతిపక్షం ఇంకా అయోమయంలోనే ఉంది. 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే నాటికి పెన్షన్లు కేవలం 200 రూపాయిలు మాత్రమే. అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని 1000 రూపాయిలు చేశారు. ఇప్పుడు ఏకంగా 2000 చెయ్యడంతో ఇది సామాన్యమైన విషయం కాదు.

అంటే కనీసం 10 రేట్లు పెంచినట్టు అయ్యింది. పెన్షన్ల ఖర్చు ప్రతి నెల 1,300 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 15,600 కోట్లరూపాయలు, ఐదు ఏళ్ల కు 78,000 వేలకోట్ల రూపాయలు అంటే మేఘాలయ,అస్సోం, లాంటి రెండు రాష్ట్రాల బడ్జెట్ అన్నమాట. పెన్షన్ల కనీసం వయసు 45 సంవత్సరాలకు తగ్గిస్తామనే దాని మీదే ఇప్పుడు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పూర్తిగా ఆశలు పెట్టుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఇప్పటికే చాలా మంది హర్షించడం లేదు. దీనితో దాని ద్వారా లబ్ది అనేది అనుమానమే అని ఆ పార్టీ వారే అనుకుంటున్నారు.