Chandrababu Naidu Inaugurates Kurnool Solar Mega Parkరాష్ట్రంలో జారుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతుందని, వాటి పేరు మార్చి చంద్రబాబు తనవిగా చెప్పుకుంటున్నాడని తరచు విమర్శిస్తూ ఉంటారు బీజేపీ రాష్ట్ర నేతలు. కేంద్ర నిధులు అనేది రాష్ట్రం కట్టిన పన్నులలో వాటా మాత్రమే అని వాటిని కొట్టి పారేస్తారు కొందరు. ఈ గొడవ ఎలా ఉన్నా… బీజేపీ నేతల వాదనలో పస ఏపాటిదో ఒక ఉదాహరణ ఇప్పుడు చూద్దాం… కర్నూల్ లో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ మొదలయ్యింది.

దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించింది. అయితే ప్రధాని కార్యాలయం దీనికి స్పందించలేదు. తమకు అనుకూలమైన సమయంలోనే కార్యక్రమం పెట్టుకుంటాం అని ప్రభుత్వం చెప్పినా స్పందన లేదు. దీనితో సైలెంట్ గానే ఉత్పాదన మొదలు పెట్టేశారు. ప్రధానికి ఆహ్వానం పంపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే మర్యాద కాదని ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండానే ఉత్పాదన మొదలు పెట్టేశారు.

ఇటువంటి అవకాశాన్ని వదిలేసుకొని బీజేపీ వారు ఎవరిని మాత్రం నిందించి ఏమీ ఉపయోగం? దీనితో దేశానికే తలమానికం అనుకున్న ప్లాంటు ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండానే ప్రారంభం అయిపోయింది. ఒక గిగా వాట్ సామర్ధ్యం గల ఈ ప్లాంటు ప్రపంచంలోనే పెద్దది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం 9 నెలలలోనే 5683.22 ఎకరాలు సమీకరించింది. దాదాపుగా 7000 కోట్ల పెట్టుబడితో మొదలు పెట్టిన ఈ ప్లాంటు ఏడాదికి 2100 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్తును ఉత్పాదన చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల వాటా 50% కాగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వాటా 50%.