Chandrababu Naidu has no rest even after pollsపోలింగ్ ఇంకా పూర్తి కాకుండా మీడియా ముందుకు వచ్చిన జగన్ హాలిడేకి వెళ్తున్నా అని ప్రకటించేశారు. పవన్ మీడియాతో కూడా మాట్లాడకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. నాలుగు రోజులు రెస్టు తీసుకుని ఆయన కూడా యూరప్ వెళ్తారని సమాచారం. అయితే చంద్రబాబు ఈవీఎంలు అంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఇంకా పొలిటికల్ మూడ్ లోనే ఉన్నారు. రేపటి నుండి ఆయన వేరే రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలకు ప్రచారం చెయ్యబోతున్నారు.

మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత దేవే గౌడ కోరిక మేరకు రేపు కర్ణాటకలోని మాండ్య జిల్లాలో జేడీఎస్ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. దేవే గౌడ మనవడు నిఖిల్ అక్కడ నుండి బరిలో ఉన్నారు. త్వరలో వెస్ట్ బెంగాల్, ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయనతో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారని సమాచారం. ఈ ముగ్గురు నేతలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు.

కర్ణాటకలో తెలుగు వారు ఎక్కువగా ఉండడంతో అక్కడ చంద్రబాబు ప్రభావం ఉండవచ్చని జేడీఎస్ నేతలు భావిస్తున్నారు. అలాగే స్టాలిన్ తరపున తమిళ నాడులో కూడా ఆయన ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తి అయిపోవడంతో మిగిలిన ఆరు విడతలలో బీజేపీ ఓటమికి చంద్రబాబు పని చేసే అవకాశం దొరికింది. చివరి విడత ఎన్నికలు మే 19న పూర్తి అవుతాయి. మే 23న దేశవ్యాప్తంగా ఒకే సారి కౌంటింగు జరిగి ఫలితాలు అదే రోజు వెల్లడవుతాయి.