Chandrababu Naidu Fires YS Jagan Mohan Reddyఅభివృద్ధి జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని, తద్వారా తమకు ఉనికి లేకుండా పోతుందని ప్ర‌తిప‌క్ష పార్టీ భావిస్తోంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ… తాను రాజధాని నిర్మించేది ప్రజల కోసమే గానీ, ప్రతిపక్షం కోసం కాదని పంచ్ లు వేసారు. ప్రతిపక్ష పార్టీలకు నిజంగా రాజ‌ధాని నిర్మాణంపై అంత ప్రేమ ఉంటే కేసులు ఎందుకు వేశారని ప్ర‌శ్నించారు.

తాము రాష్ట్రంలో జ‌రుపుతోన్న‌ పనులను అడ్డుకోవ‌డ‌మే ధ్యేయంగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తోందని మండిప‌డ్డారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్షాన్ని న‌మ్మ‌డం మానేశారని, రాజ‌ధాని విష‌యంలో ప్ర‌తిపక్ష పార్టీలు ప్ర‌తి రోజు విమ‌ర్శలు చేస్తూనే ఉన్నాయ‌ని ఎద్దేవా చేసారు. తాజాగా అమ‌రావ‌తి ఆకృతుల‌పై చ‌ర్చించామ‌ని, నార్మ‌న్ ఫోస్ట‌ర్ సంస్థ ఆకృతుల‌పై ఇంకా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని చెప్పారు. మంచి ఫ‌లితాల కోసం కాస్త ఆలస్య‌మైనా ఫ‌ర్వాలేద‌ని, ప్ర‌పంచంలోని అద్భుత భ‌వ‌నాల జాబితాలో రాజ‌ధాని భ‌వ‌నాలు ఉండాల‌ని అన్నారు.

ఈ భవన ఆకృతుల్లోని కొన్ని అంశాలు బాగున్నాయని… అయితే బాహ్య రూపం మాత్రం చూడముచ్చటగా లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిజైన్లను రూపొందించడానికి కొంచెం సమయం తీసుకుని అద్భుతమైన డిజైన్లను రూపొందించాలని చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్కిటెక్ట్ లతో పాటు రాష్ట్రంలోని అత్యున్నత అర్కిటెక్ట్ లతో ఓ టీమ్ ను తయారు చేయాలని మంత్రులకు ఆయన సూచించారు. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళితో కూడా వెంటనే సంప్రదింపులు జరపాలని సీఆర్డీఏ కమిషనర్ ను ఆదేశించారు.