Chandrababu Naidu Fires on YSRCP MPsరాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర పథకాల ద్వారా వీలైనన్న ఎక్కువ నిధులను తెచ్చుకునేందుకు తాను ప్రయత్నిస్తుంటే… వైసీపీ ఎంపీలు కుట్రపూరితంగా ఫిర్యాదులు చేస్తూ, నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్రం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకంపై వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డిలు కేంద్రానికి లేఖలు రాసి, నిధులు రాకుండా ఆపించారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు… “వీరు మనుషులా? లేక రాక్షసులా?” అంటూ మండిపడ్డారు.

పేదలకు కూలీ డబ్బులు కూడా అందడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని, గతంలో తాను కూడా ప్రతిపక్షంలో ఉన్నానని… అయితే, రాష్ట్రానికి నష్టం వాటిల్లేలా ఎన్నడూ ప్రవర్తించలేదని అన్నారు. వైసీపీ ఎంపీలు రాసిన లేఖలను కరపత్రాలుగా ప్రజలకు ఊరూరా పంచాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్ర వాటాతో కలిపి 8 వేల కోట్ల పనులు జరుగుతున్నాయని… దీంతో సహజంగానే అందరి కళ్లు మనపైనే ఉన్నాయని అన్నారు. కేంద్ర అధికారులు కూడా ఒక కన్నేసి ఉంచారని… ఈ నేపథ్యంలో పనుల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఖాతాలను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.