Chandrababu Naidu fires on YSR Congress governmentకృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. “వంశీని లొంగదీసుకోవాలని కావాలనే తప్పుడు కేసు పెట్టారు. వంశీ ఏం నేరం చేశాడని కేసు పెట్టారు?. వంశీపై కేసు పెట్టడం కాదు.. ఎమ్మార్వో, ఎస్సైని అరెస్ట్ చేయాలి,” అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.

“అచ్చెన్న, కూన రవి, సోమిరెడ్డి, యరపతినేనిపై కేసులు పెట్టారు. కోడి కత్తి కేసు ఏమైంది?. సొంత బాబాయి వివేకా కేసును ఏం తేల్చలేకపోయారు. నేను దేనిని వదిలిపెట్టేది లేదు. చిత్రగుప్తుడి మాదిరిగా మీ పాపాల చిట్టా రాస్తున్నా. అన్నిటికీ బదులు చెప్పే రోజు వస్తుందని తమ్ముళ్లు,” అని చంద్రబాబు అధికార పార్టీ నేతలను వారించారు.

మరోవైపు అధినేత భరోసాతో వంశీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటివరకు వంశీ స్పీకర్ ఫార్మటులో రాజీనామా పత్రం సమర్పించని విషయం తెలిసిందే. ఇసుక కొరత నేపథ్యంలో వస్తున్న విమర్శల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చెయ్యడం మొదలు పెట్టారని చంద్రబాబు భావిస్తున్నారు.

ఇటువంటి చర్యల ద్వారా స్థానిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం కాకుండా చెయ్యాలని అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా చంద్రబాబు జిల్లాల పర్యటన ఈరోజు కృష్ణా జిల్లా పర్యటనతో శ్రీకారం చుట్టారు. ప్రతీ జిల్లాలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు పెట్టబోతున్నారు.