chandrababu naidu fires on YS jaganరాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలను మాత్రమే ఆశించి పని చేస్తున్న వైఎస్సార్సీపీ… తాజాగా ‘స్పెషల్ స్టేటస్’ అంశంపై కేంద్ర మంత్రులు చేసిన ప్రకటనలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా వైసీపీకి సంబంధించిన మీడియాలలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై వ్యతిరేక ప్రచారం చేయడం ప్రారంభించింది. ఏపీకి వెన్నుపోటు పొడిచారంటూ జగన్ పత్రిక కధనాలపై సీరియస్ అయిన చంద్రబాబు, పరోక్షంగా వార్నింగ్ తో కూడిన హెచ్చరికలు తెలియజేసారు.

రాష్ట్రంలో పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు సహా నూతన రాజధాని అమరావతిని అడ్డుకునే ప్రయత్నం చేసి, చివరకు కాపుల ఉద్యమంలో ప్రవేశించి దారుణంగా వ్యవహరించారు. అయినా నా ముందు వారి ఆటలు సాగవు. ఎవరైనా సరే… ‘తోక జాడిస్తే కట్ చేస్తా.’ ఇక ఎంతమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా, రాష్ట్ర విభజన జరిగిన నాడు కుట్రపూరితంగా వ్యవహరించారని చంద్రబాబు ఆరోపించారు.

ఆనాడు ఇరు రాష్ట్రాల పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడి, ఏం ఇస్తారో చెప్పి విభజన చేయాలని సూచనలను పట్టించుకోకుండా ఇష్టానుసారం చేశారు. యుద్ధ విమానంలో హైదరాబాద్ కు విభజన బిల్లు తెచ్చారు. పార్లమెంటు తలుపులు మూసి, టీవీలు ఆపేసి దారుణంగా విభజన చేశారు. ఇవన్నీ మరోసారి గుర్తు చేసుకుని కసిగా పనిచేయాలన్న పట్టుదల ప్రజల్లో రావాలనే మరోమారు చెబుతున్నా… ఆనాడు వైసీపీ కపట నాటకాలాడింది. అప్పటివరకు జైల్లో ఉన్న జగన్… విభజన బిల్లు రాగానే బయటకు వచ్చారు. ఇదంతా కుట్రపూరితంగా జరిగింది. అయినా ప్రజలు టీడీపీపై నమ్మకంతోనే మాకు ఓటేశారు… అంటూ ఆగ్రహాన్ని ప్రదర్శించిన చంద్రబాబు వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.