సిఎం జగన్మోహన్ రెడ్డి సమస్యలొచ్చినప్పుడల్లా మరో పెద్ద సమస్యని సృష్టిస్తూ ప్రజల దృష్టిని మళ్ళిస్తుంటారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖకి రాజధాని తరలించడం అసాధ్యమని తెలిసి ఉన్నా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు, ముహూర్తలు, మీడియా లీకులిస్తూ డ్రామాలు ఆడుతూ ప్రజలని మభ్యపెడుతూ కాలక్షేపం చేసేస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతకాలం కర్నూలు న్యాయరాజధానిగా చేస్తామని, అక్కడే హైకోర్టు ఉంటుందని రాయలసీమ ప్రజలని మభ్యపెట్టిన వైసీపీ ప్రభుత్వం, హైకోర్టుని తరలించే ఉద్దేశ్యం లేదని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ చేత సుప్రీంకోర్టులో చెప్పించిన మాట వాస్తవమా కాదా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కర్నూలుకి హైకోర్టుని తరలించే ఉద్దేశ్యం లేకపోతే అక్కడ న్యాయరాజధాని ఏవిదంగా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు.
త్వరలో విశాఖకి షిఫ్ట్ అవుతున్నానని, విశాఖలో బీచ్ రోడ్డులో ముఖ్యమంత్రి నివాసం ఉంటుందని మీడియాకి లీకులు ఇస్తూ ఇప్పుడు అదేవిదంగా ఉత్తరాంద్ర ప్రజలని కూడా మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన తర్వాత జగన్ ప్రభుత్వం మళ్ళీ మూడు రాజధానుల బిల్లు ఏవిదంగా చేస్తుందని ప్రశ్నించారు. శాసనసభకి రాజధానులు ఏర్పాటు చేసే అధికారం లేదని హైకోర్టు తెలియకనే చెప్పిందని సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు భావిస్తున్నారా?అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
హైకోర్టు చెప్పినా మళ్ళీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టి ఏపీకి అమరావతే రాజధాని అని మరోసారి చెప్పించుకొన్నారు కదా?అని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. అయినా వైసీపీ నేతలు ఇంకా ప్రజలని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ నేతలు అందరూ కలిసి మూడు రాజధానుల పేరుతో ముక్కలాట ఆడుతూ మూడు రాజధానులు ప్రాంతాల ప్రజలని మోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.
విశాఖ రాజధాని అయితేనే తమ జిల్లాలు అభివృద్ధి అవుతాయని కొందరు మంత్రులు మాట్లాడుతుండటం వారి ఆజ్ఞానానికి నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ మంత్రి విశాఖని ప్రత్యేక రాష్ట్రం చేయాలంటున్నారు. రేపు మరో మంత్రి కర్నూలుని ప్రత్యేక రాష్ట్రం చేయమని అడగొచ్చు. ఆ తర్వాత 26 జిల్లాలని 26 రాష్ట్రాలుగా చేయాలని అడుగుతారేమో? మంత్రి హోదాలో ఉన్నవారు రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకొని పాలన చేయాలి తప్పితే ఎల్లప్పుడూ రాజకీయ కోణంలోనుంచే ఆలోచనలు చేయకూడదు,” అని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.