Chandrababu - Naidu -అమలు కాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తమకు జీతాలు పెంచినందుకు గానూ చంద్రబాబుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పరిటాల సునీత, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తనను కలిసిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…. ఏదైనా పార్టీ వరుసగా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు.

“రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం ఉన్న సంతృప్తి 90 శాతానికి పెంచాలన్నదే లక్ష్యం. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి మీ అందరూ అండగా నిలిస్తే ప్రతిపక్షం అనేది ఉండదు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే 25 ఎంపీ సీట్లు సాధిస్తుంది. అప్పుడు ప్రధానిని మనమే నిర్ణయిస్తాం. ఫలితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు లభిస్తాయి. కేంద్రం నుంచి విభజన హామీలను దబాయించి సాధించవచ్చు. దాంతో ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. తద్వారా ప్రజల జీవనప్రమాణాలు అధికమవుతాయి. చంద్రన్న ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని గ్రామాల్లో చాటాలి.

కేంద్ర సర్కారు వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించింది. కేంద్రం జీఎస్టీ అమలు, నోట్ల రద్దు వంటివి చేయడం వల్ల దేశ ప్రజలందరికీ కష్టాలు వచ్చాయి. నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అంగన్‌ వాడీ టీచర్ల, ఆయాల బాధలను తొలగించేందుకు జీతాలు 10500, 6000కు పెంచాం. పేదవాళ్లకు అండగా ఉండాలనే లక్ష్యంతో అంగన్వాడీ, ఆయాల వేతనాలు పెంచాం. దేశంలో ఏరాష్ట్రం చేయని విధంగా సంపదను 10.5 శాతం అధికం చేశాం. జాతీయంగా వ్యవసాయ రంగంలో 2.5 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 11 శాతం ఉండటాన్ని గమనించాలి.

స్విస్ బ్యాంక్ నుంచి నల్లడబ్బు తెచ్చి ప్రతి పౌరుడికీ 15 లక్షలు ఇస్తామని చెప్పిన ఎన్నికల హామీని ప్రధాని మోడీ నెరవేర్చలేకపోయారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ 20,000కు పైగా విద్యా వాలంటీర్ల ఉపాధిని దెబ్బతీసింది. కేంద్రం మాటలు చెప్పింది కానీ చేతలలో చూపించలేకపోతోంది. కేంద్రానికి ఎన్నికల హామీలు అమలు చేయడం కష్టంగా మారింది. రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి పెంచడం మూలంగా భవిషత్తులో విద్యుత్ ధరలు తగ్గించే స్థితికి వచ్చాం. వినూత్న ఆలోచనలతో అభివృద్ధి ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వ చిత్తశుద్ధిని, ఉత్తమ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.