Chandrababu-Naidu -fires on Narendra -Modiమోడీ అన్న మాట ఉచ్చరించడానికే వైసీపీ, జనసేన పార్టీ అధినేతలు భయపడుతున్న పరిస్థితి. అలాంటిది ఢిల్లీలో కూర్చుని ప్రధాని నరేంద్ర మోడీని ఏకిపారేసారు ఏపీ సిఎం చంద్రబాబు. పార్లమెంట్ సాక్షిగా టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులు మోడీ తీరును తూర్పారబట్టగా, అది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే బాబు మరోసారి మోడీపై విరుచుకుపడ్డారు.

విభజన తర్వాత కేసీఆర్ అభివృద్ధిపై దృష్టి పెట్టారంటూ తనను తూలనాడే విధంగా ఒక ప్రధాని మాట్లాడవచ్చా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అలాగే స్పెషల్ స్టేటస్ అంశంలో వైసీపీ ట్రాప్ లో పడిపోయారని, ఒక అవినీతి పార్టీతో ప్రధాని పోల్చడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన బాబు, దీని వెనుక మోడీ రహస్య అజెండా ఉందన్న భావాలను వ్యక్తపరిచారు.

అధికారంలోకి వచ్చిన ఏడాది లోగా అవినీతి పరుల అంతం చూస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన మోడీ, ఇప్పటివరకు చేసిందేమీ లేకపోగా, అవినీతి పరులైన జగన్, గాలి జనార్ధన్ రెడ్డి వంటి వారిని వెనుకేసుకు వస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తూ దేశానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మధ్య మధ్య రాష్ట్ర ప్రతిపక్షం అయిన వైసీపీపై కూడా విమర్శలు గుప్పించారు గానీ, ప్రధాన ఫోకస్ అంతా మోడీపైనే ఎక్కుపెట్టారు.

ప్రతిపక్షాలను విమర్శించడంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ వేదికగా నిలదీయడంలో బాబు స్పష్టంగా వ్యవహరించారు. సరిగ్గా ఇదే విధంగా కేంద్రాన్ని ప్రశ్నించడంలో జగన్, పవన్ లు చేయలేకపోతున్నారు. టిడిపిని విమర్శించడంతో పాటు, బిజెపిని నిలదీయలేక చతికిలపడడం జగన్, పవన్ ల వంతవుతుండగా, వైసీపీ, జనసేనలను విమర్శిస్తూ బిజెపి తీరును ఎండగట్టడం బాబుకు మాత్రమే సాధ్యమవుతోంది. ఎవరి చిత్తశుద్ధి ఏమిటన్నది ఇక్కడే బయట పడుతున్నదేమో..!