Chandrababu-- Naidu - farmers scheme-తెలంగాణలోని రైతు బంధును పోలిన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెస్తున్న సంగతి తెలిసిందే. ‘అన్నదాతా సుఖీభవ’ పేరుతో భారీ పథకానికి రూపకల్పన చేస్తున్నారు. అందులో భాగంగా తక్షణ సాయంగా రాష్ట్ర్రంలో సాగులో ఉన్న 2 కోట్లకుపైగా ఎకరాలకు, రూ.2,500 చొప్పున సుమారు 5వేల కోట్లు అందజేయనుంది. అయితే రైతు బంధులో పట్టించుకోకుండా వదిలేసిన కౌలు రైతులను కూడా అన్నదాతా సుఖీభవలో భాగస్వామ్యులను చెయ్యాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

భూయజమానులకు, కౌలు రైతులకు మధ్య స్పర్థలూ తలెత్తకుండా, సామరస్యంగా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. అసలు రైతులే సాగుచేస్తున్న చోట ఎకరానికి 2,500 చొప్పున వారికే చెల్లిస్తారు. కౌలు రైతులున్న చోట.. 50:50 లేదా 60:40 నిష్పత్తిలో ఇద్దరికీ పంచాలని భావిస్తోంది. అయితే ఈ ప్రక్రియ అంత తేలిక కాబోదు. ఎందుకంటే చాలా వరకు కౌలు ప్రక్రియకు ఎలాంటి రాత కోతలు ఉండవు. నోటి మాట మీదే నడుస్తాయి. దీనితో వారిని గుర్తించడం అంత తేలిక కాదు.

మరోవైపు భూయజమానులకు ఇది పెద్దగా రుచించదు. భూమి రేట్లకు కౌలు డబ్బుకు సంబంధం లేదని వారిలో ఎప్పటి నుండో ఒక అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఈ డబ్బులో భాగమంటే వారికి కచ్చితంగా రుచించదు. ఇది ఒక తేనె తుట్ట అని భావించి తెలంగాణ ప్రభుత్వం దీనిని భూ యజమానులకే పరిమితం చేశారు. ఇది సమర్ధవంతంగా చేపట్టకపోతే కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎన్నికల ముందు దీనిని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. తెలంగాణాలో అమలు చెయ్యబోతున్నట్టే ఎకరాకు 10 వేల రూపాయిలు ఇవ్వబోతున్నారు. 2 కోట్ల ఎకరాలకు ఏటా 20వేల కోట్లు అందజేయాల్సి ఉంటుంది.

లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు ఈ పధకం కొంత ఇబ్బంది అనే చెప్పుకోవాలి. అయితే పథకం వల్ల రాష్ట్రంలోని 96 లక్షలకుపైగా ఉన్న రైతులు, కౌలు రైతులకు మేలు జరగనుంది. దీనితో ఇది రాజకీయంగా ఓట్లు కురిపించే పథకం అని దీని అమలుకే మొగ్గు చూపుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. తొలుత వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలుచేయాలని మొదట భావించినా.. ఎకరానికి 2,500 చొప్పున ఇప్పుడే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికార వర్గాల సమాచారం. వచ్చే ఖరీఫ్‌ నుంచి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. అప్పుడు ప్రతి సీజన్‌లో ఎకరానికి 5,000 చొప్పున ఏడాదికి ఎకరానికి 10వేలు ఆర్థికసాయం అందజేయాలన్నది ప్రతిపాదన.