Chandrababu Naidu Visionరాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి చంద్రబాబు ‘విజన్’ గురించి ప్రజలకు తెలిసిన విషయమే. గతంలో ‘విజన్ 20-20’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రచించిన విషయం విదితమే. అయితే మీద పడుతున్న వయసు రీత్యా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ‘విజన్’ ఎలా ఉంది… అన్న విషయాన్ని మాత్రం వైద్యులు తేల్చాల్సి ఉంది. ఈ విషయం పైనే ఆదివారం నాడు వైద్య పరీక్షలు నిర్వహించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటన చేసారు.

విజయవాడ, తాడిగడపలో గల ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో దాదాపు మూడు గంటల పాటు పరీక్షలు నిర్వహించగా, వయసు పెరిగినా గానీ, చంద్రబాబు నాయుడు కంటి చూపు ఏ మాత్రం తగ్గలేదని డిక్లేర్ చేసారు. సాధారణ పరీక్షల్లో భాగంగానే ఈ వైద్య పరీక్షలు జరిగినట్లుగా తెలిపారు. సిఎం చంద్రబాబుతో పాటు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు.

అనంతరం హాస్పిటల్ ప్రాంగణాన్ని పరిశీలించిన చంద్రబాబు నిర్వాహకులపై ప్రశంసలు కురిపించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చుట్టూ ఏర్పాటు చేసిన మొక్కల పచ్చదనాన్ని కొనియాడారు. రోగులకు ఆసుపత్రిలో పెట్టే ఆక్సిజన్ కంటే సహజసిద్ధంగా ఇలా చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్ మంచిదని ప్రత్యేకంగా హాస్పిటల్ నిర్వాహకులను ప్రశంసించారు.