Chandrababu Naidu - Budget 2018నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు రిక్త హస్తం చూపించింది కేంద్రం. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి, పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే కావడంతో రాష్ట్ర అవసరాలు, ఆకాంక్షలు, విజ్ఞప్తులు ఏవి పట్టించుకోలేదు. రాష్ట్ర దశ దిశలను నిర్దేశించే రాజధాని, రైల్వేజోను, దుగరాజపట్నం నౌకాశ్రయం వంటి కీలకమైన ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు.

ఏవో కొన్ని ప్రాజెక్టులకు మాత్రం అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. దీనితో బీజేపీపై తీవ్ర నిరాశ, ఆగ్రహంతో ఉన్నారు రాష్ట్ర ప్రజలు. అయితే వారి కోపాన్ని ప్రతిబంబించే నాయకుడు ఎవరు అనేది చూడాల్సి ఉంది. కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి ఎన్డీఏ నుండి తెలుగు దేశం పార్టీ బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రజల ఎమోషన్స్ ను గౌరవించాల్సిన అవసరం చంద్రబాబుకు ఎంతైనా ఉంది. అదే సమయంలో 2019లో తిరిగి అధికారంలోకి వచ్చే ఎన్డీయేను వదులుకోవడం అంత తేలిక కాదు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పటిదాకా బడ్జెట్ పై స్పందించింది లేదు. కేంద్రంతో పెట్టుకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయని ఆయన వెనుకంజ వేస్తున్నట్టు మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఇంకోవైపు అందరిని ఆశ్చర్యపరుస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇప్పటిదాకా ఆయన గానీ పార్టీ గానీ బడ్జెట్ పై స్పందించింది లేదు. దీనితో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశ, ఆగ్రహంతో ఉన్నారు. తమ ఆగ్రహాన్ని ప్రతిబంబించే నాయకుడు కోసం చూస్తున్నారు.