Once a King Maker, Naidu continues to yieldరాష్ట్రంలో కరవు పరిస్థితిపై చర్చిద్దాం రమ్మంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి పిలుపు అందుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. కరవుపై ప్రధానితో భేటీ ముగియగానే… అక్కడికక్కడే ఏపీకి ‘ప్రత్యేక హోదా’పై చంద్రబాబు ప్రధానితో ప్రత్యేక భేటీని నిర్వహించనున్నారు. ఈ భేటీకి సంబంధించి రాష్ట్రం తరఫున గట్టి వాదననే వినిపించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

పార్టీ సీనియర్లు, మంత్రులు, పలు కీలక శాఖల ఉన్నతాధికారులతో విజయవాడలో వరుస భేటీలు నిర్వహించిన చంద్రబాబు, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేంద్రం చేసిన సాయం, చేయాల్సిన సాయం తదితరాలకు సంబంధించి పక్కా లెక్కపత్రాలు సిద్ధం చేసుకున్నారు. కేంద్ర సాయానికి సంబంధించి అణా పైసలు సహా లెక్కలు వేసి అధికారులు ఇచ్చిన నివేదికలను చేతబట్టుకుని మోడీ వద్దకు వెళ్లనున్న చంద్రబాబు… గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా కాస్తంత గట్టిగానే తన స్వరాన్ని వినిపించాలని నిర్ణయించుకున్నారు.

‘ప్రత్యేక హోదా ఏపీ హక్కు’ అన్న సింగిల్ నినాదంతో చంద్రబాబు వ్యూహం రచించుకున్నారు. మొత్తం 12 అంశాలను చంద్రబాబు ప్రధాని వద్ద ప్రస్తావించనున్నారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధానితో చంద్రబాబు భేటీలో ఏ ఫలితాలు వస్తాయన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఢిల్లీ చేరుకున్న వెంటనే, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ రావుతో పాటు పార్టీ ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు, సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు.