Chandrababu-Naidu--honesty
తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బల్లి దుర్గ ప్రసాద్ రావు అకాలమరణంతో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఇంకా షెడ్యూల్ కూడా విడుదల కాకముందే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల్లో ఆమె పోటీ చేసి రెండు లక్షలపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.

వచ్చే ఏడాది తొలి భాగంలో ఇక్కడ ఉప ఎన్నిక జరగవచ్చని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. సహజంగా చంద్రబాబు నాన్చుడుకు ప్రతీతి. ఏ ఎన్నికైన చివరి నిముషం వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం.. ఆ తరువాత సదరు అభ్యర్థికి ప్రచారంలో టైం సరిపోకపోవడం పరిపాటే. అటువంటిది ఇంతముందుగా అభ్యర్థిని ప్రకటించడం టీడీపీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచింది.

1996 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్న పనబాక 11వ లోకసభకు మొదటిసారి నెల్లూరు పార్లమెంట్‌ నుంచి గెలుపొందారు. ఆతర్వాత 12, 14, 15వ లోకసభకు ఎన్నికవుతూ వచ్చారు. 2004లో నెల్లూరు నుంచి 2009లో బాపట్ల నుంచి గెలుపొందారు. యూపీఏ ప్రభుత్వంలో పెట్రోలియం, కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

2014లో బాపట్లలో ఓటమి చెందారు. తిరుపతి పార్లమెంట్ కింద నాలుగు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఓటింగు తమకు కలిసి వస్తుందని, పైగా సిట్టింగ్ ఎంపీ మరణంతో వచ్చే సానుభూతితో తామే గెలుస్తామని అధికార పక్షం అంటుంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని టీడీపీ అంచనా వేస్తుంది.