Chandrababu naidu counter to nitin Gadkariకేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ఎప్పటిలానే తనదైన శైలిలో మాటలు ఘనం, పనులు శూన్యం అంటూ ముందుకు పోయారు ఆయన. ఎపిలో గత ఐదేళ్లలో కేంద్రం నుంచి అందినంత సాయం ఇంతవరకు ఎప్పుడు అందలేదని ఆయన చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా దీనిని ఎవరూ మర్చిపోరాదని, రాజకీయ నేతలకు,టిడిపికి దీనిపై తాను సవాల్ విసురుతున్నానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా స్వీకరిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వం సహకారంతో పోలవరం పనులు 62 శాతం పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం విషయంలో కేంద్రం ఘనతను రాష్ట్రం ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలియడం లేదన్నారు. అయితే ఈ సవాల్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. గడ్కరీ రాష్ట్రం దాటాక ముందే పోలవరం నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు లేఖరాశారు. పోలవరానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 3,722 కోట్లు తక్షణం విడుదల చేయాలని కోరారు.

ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 10,459 కోట్లు ఖర్చు చేయగా కేవలం 6,727 కోట్లు మాత్రమే ఇచ్చారని, గత జులైలో పోలవరంలో కేంద్రమంత్రి గడ్కరీ పర్యటించినప్పుడు ఫిబ్రవరిలోపు నిధులు మొత్తం విడుదల చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయంలో ఎంతవరకు మాట మీద నిలబడ్డారో చెప్పాలని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. అదే విధంగా జూన్ 18 తరువాత ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చెయ్యలేదని ఆయన గుర్తు చేశారు.

ఇంత కీలకమైన ప్రాజెక్టుకు ఆరు నెలల పైగా డబ్బులు ఇవ్వకపోతే పనులు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వకుండా మేమే కడుతున్నాం అని ఎలా చెప్పగల్గుతున్నారు అని ప్రశ్నించారు చంద్రబాబు. దీనితో గడ్కరీ చేసిన ప్రగల్బాలకు ముఖ్యమంత్రి వెంటనే స్పందించినట్టు అయ్యింది. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దులిపేద్దామని అని తొలుత అనుకున్నా మర్యాద కోసం లేఖతో సరిపెట్టారని టీడీపీ వర్గాల సమాచారం. మంత్రి అధికారిక పర్యటనకు కాకుండా విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన కృష్ణా జిల్లా, విజయవాడ నగర భాజపా ముఖ్య కార్యకర్తల సమావేశానికి రావడం గమనార్హం.