Chandrababu-Naidu,-Congress-TDP-Allianceతెలంగాణాలో ఎన్నికల తంతు ముగిసింది. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ కారు మరో సారి దూసుకుపోయింది. ఏకంగా 88 స్థానాలు కైవసం చేసుకుని అడ్డువచ్చిన ప్రతిపక్ష పార్టీలను తొక్కించేసింది. ఈ క్రమంలో మహాకూటమికి కేవలం 21 సీట్లు మాత్రమే వచ్చాయి. ఓటమికి గల కారణాలపై కాంగ్రెస్ నేతలు పెదవి మెదపడం లేదు. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం చంద్రబాబుతో జతకలవడం వల్లే కాంగ్రెస్ నష్టపోయిందని ప్రచారం చేస్తున్నాయి. తద్వారా చంద్రబాబును ఆంధ్రాలో రాజకీయంగా దెబ్బ కొట్టడం వారి వ్యూహం.

ఈ ఎన్నికలలో చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు ఓడిపోవడంతో చంద్రబాబుని నిందించడానికి ఏముంది అని పార్టీలో విస్తృత అభిప్రాయం. పార్టీ హై కమాండ్ కూడా కేవలం 13 సీట్లలో పోటీ చేసిన టీడీపీని నిందిస్తే లాభం లేదనే నిర్ణయానికి వచ్చిందంట. “తెలంగాణాలో ఎప్పుడూ కాంగ్రెస్ పోటీలో లేదు. మహాకూటమి ఏర్పడ్డాక కొంత ఊపు వచ్చిన మాట వాస్తవమే. అయితే దానిని ఎక్కువగా ఊహించుకోవడం అదే సమయంలో కొన్ని తప్పులు చెయ్యడంతో తెరాస విజయం సునాయాసం అయ్యింది,” అని ఒక సీనియర్ నేత విశ్లేషణ

దీనిగురించి రాహుల్ గాంధీ ఇప్పటికే చంద్రబాబుతో మాట్లాడారని సమాచారం. ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు గురించి ఆయన మాట్లాడుతూ “మీకు రాజకీయంగా ఉపయోగపడుతుందో, లేదో ఆలోచించి నిర్ణయం తీసుకోండి” అని సూచించారట. తెలంగాణాలో కూటమి కోసం టీడీపీ కొన్ని త్యాగాలు చేసింది ఆ క్రమంలో కొంత నష్టపోయింది కూడా. దానిని కాంగ్రెస్ హై కమాండ్ గుర్తించిందంట. ఈ క్రమంలో ఏపీ విషయంలో కొంత పట్టువిడుపూ గా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చిందట.

“ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాంగ్రెస్ ఉనికి అనేదే లేదు. ఈ క్రమంలో అక్కడ ఏం చేసినా అధికారంలోకి రావడం కష్టం. ఈ క్రమంలో చంద్రబాబు అనుభవాన్ని జాతీయ స్థాయిలోనే ఎక్కువ అవసరం అనే అభిప్రాయానికి వచ్చాం. ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే సానుకూలంగా పరిష్కరిస్తామని మాత్రం సంపూర్ణంగా హామీ ఇచ్చి టీడీపీకి సహకరిస్తాం,” అని ఒక సీనియర్ నేత అన్నారు. దీని బట్టి ఎలా అయితే తెలంగాణలో తెరాస ఎంఐఎం ఎన్నికలకు వెళ్ళారో అదే వ్యూహం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయబోతున్నారట.