Chandrababu Naidu confidence on tdp winningఫలితాలు మరో 18 రోజులలో వస్తున్నాయనగా సార్వత్రిక ఎన్నికలపై అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడుతూ… టీడీపీకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్‌ అనేక కుట్రలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. “మన పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యర్థులు పన్నిన కుట్రలను పోటాపోటీగా ఎదుర్కొన్నాం. కార్యకర్తలతో మమేకమయ్యే టీడీపీలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదు,” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

“ఎందరు ఇబ్బందులు పెట్టినా ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారు. ప్రమాణాలు, ముహూర్తాలు, మంత్రి పదవులంటూ వస్తోన్న వార్తలన్నీ మైండ్‌గేమ్‌లో భాగమే. రాష్ట్రంలో మళ్లీ తెదేపా ప్రభుత్వమే వస్తుంది. సీట్లు, ఆధిక్యతపైనే దృష్టి ఉంది. భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికలోనూ టీడీపీనే గెలవాలి. నేను వాస్తవికత ప్రాతిపదికగానే మాట్లాడాతా. పనిచేస్తా’’ అని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికల సమయంలో ఎంతోమంది విలన్లను తట్టుకొని నిలబడ్డామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.

అయితే ఎన్నికల ముందు వచ్చిన చాలా వరకూ సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉండటంతో తెలుగు తమ్ముళ్లు దిగాలుగా ఉన్నారు. చంద్రబాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉండటంతో వారు కొంత మేర ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఓటర్ల తీర్పు ఎటువుంటుంది అనేది తేలాలంటే ఈ నెల 23వరకూ ఆగాల్సిందే. విభజన అనంతరం జరిగిన మొట్టమొదటి ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాల్సి ఉంది (2014 ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. ఎన్నికల అనంతరం రాష్ట్రాలు విడిపోయాయి).