ఏడాది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాజకీయాలలో బిజీబిజీగా గడిపే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రతీ సంక్రాంతి పండుగకి తన స్వగ్రామం నారావారిపల్లెలో తమ నివాసంలో జరుపుకొంటుంటారు. నందమూరి బాలకృష్ణ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు నారావారి పల్లెకి చేరుకొన్నారు. అక్కడ ఆయనకి అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “గత మూడున్నరేళ్ళుగా రాష్ట్రంలో వైసీపీ విధ్వంసకర పాలన సాగుతుండటంతో ప్రజల మొహాలలో ఆనందం కనబడటం లేదు. కనుక రాష్ట్ర ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగనాడు ఈ కష్టాలు, సమస్యలను పక్కన పెట్టి ఆనందంగా జరుపుకోవాలని కోరుకొంటున్నాను. ఈ సంక్రాంతి పండుగతో వచ్చే ఉత్సాహం ఈ ఏడాదంతా పోరాడేందుకు నూతనోత్సాహం, కొత్త శక్తి ఇస్తుందని ఆశిస్తున్నాను.
తెలుగు ప్రజలకి నేను ఐటి అనే బలమైన ఆయుధం అందిస్తే దానిని ఈ వైసీపీ ప్రభుత్వం పనికిరాదని చెత్తబుట్టలో పడేసింది. వైసీపీకి నా మీద ద్వేషం ఉంటే ఉండొచ్చు కానీ రాష్ట్రానికి, యువతకి ఎంతగానో ఉపయోగపడే ఐటి రంగాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో అర్దం కాదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బ తింది. మన బ్రాండ్ ఇమేజ్‌ని మనమే పాడుచేసుకొంటునందుకు నాకు చాలా బాధ కలుగుతోంది.
ఏ ప్రభుత్వామైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. కానీ రాజకీయాలకు అర్హతే లేని వైసీపీ నేతలందరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారు. పార్టీలోనే కాదు వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించేస్తున్నారు. తమ అరాచకాలను పోలీసులతో కప్పి పుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రం, మళ్ళీ బాగుపడాలంటే, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ మళ్ళీ సక్రమంగా పనిచేయాలంటే వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించకతప్పదు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.