chandrababu naidu comments on ys jagan అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానులంటూ ప్రకటనలు చేసి, ఇటీవల ఆ బిల్లును వెనక్కి తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాల వలన ఆంధ్రప్రదేశ్ కు ఓ రాజధాని అంటూ లేకుండా పోయిన సంగతి తెలిసిందే. ప్రశ్నాత్మకంగా మారిన ఏపీ రాజధాని ఉద్యమం తెరపైకి వచ్చి నేటికీ 800 రోజులు.

ఇప్పటికి అమరావతి ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతుండడం, ఆ ప్రాంత వాసుల పట్టుదలకు, ఆకాంక్షలకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. భవిష్యత్తు తరాల కోసం నిర్మించదలచిన రాజధాని కోసమని 33 వేల ఎకరాలు తృణప్రాయంగా ఇచ్చివేసిన రైతుల జీవితాలతో నేటి సర్కార్ ఆటలాడుకోవడం, అధికార దుర్వినియోగం అనుకోవాలా? సద్వినియోగం అనుకోవాలో? అర్ధం కాని పరిస్థితి.

అసలు అమరావతిని నిర్మింప సంకల్పించిన చంద్రబాబు నాయుడు సైతం, 800 రోజుల అమరావతి ఉద్యమానికి స్పందించారు. “ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద వ్యక్తిగత కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం” అంటూ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలిని సూటిగా నిలదీసారు.

“రాజధాని ప్రాంతం స్మశానం అన్న వాళ్లే, ఇప్పుడు అమరావతి భూములను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని” ప్రస్తావిస్తూ, అమరావతిని ఏ విధంగా అడ్డు పెట్టుకుని పరిపాలన చేస్తున్నారో తెలియజెప్పారు. రాజధాని అభివృద్ధి కోసమని రైతులు ఇచ్చిన భూములను తన సొంత పార్టీ అభివృద్ధి కోసం వినియోగించుకునేలా అప్పులు చేస్తోన్న జగన్ తీరుపై మండిపడ్డారు.

“ప్రభుత్వం ఇప్పటికైనా మూడు ముక్కల రాజధానిని పక్కన పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలి. దేశ చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదేశం అండగా నిలుస్తుందని” తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వంలో చలనం వస్తుందో లేదో చూడాలి.