Chandrababu Naidu Comments on YS Jagan Governmentవైసీపీ కంచుకోట కర్నూల్ జిల్లాలో బుదవారం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు జిల్లాలోని ప్రజలందరూ ఆయనకు స్వాగతం పలకడానికి తరలివచ్చారా అన్నంతగా రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. కర్నూలు నుంచి కొడుమూరు, దేవనకొండ మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ సాయంత్రం 4 గంటలకి పత్తికొండ చేరుకొని అక్కడ బహిరంగసభ నిర్వహించాలనుకొన్నారు. కానీ రాత్రి 9 గంటలకు చేరుకోగలిగారు. అంతగా జనాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రజలకు చెప్పారు.

తాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానని శపధం చేసిన సంగతిని ప్రజలకు గుర్తుచేసి, రాబోయే ఎన్నికలలో మీరందరూ టిడిపిని గెలిపించకపోతే శాసనసభలో అడుగుపెట్టలేనని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టుకొని అభివృద్ధి చేయాలనుకొంటే, తాను రాజకీయాలలో కొనసాగాలని ప్రజలు కోరుకొంటే రాబోయే ఎన్నికలలో టిడిపిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

సంక్షేమ పధకాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పధకాలన్నీ నిలిపివేస్తుందని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తాను అధికారంలోకి వస్తే ఇంతకంటే చాలా మెరుగైన పధకాలను అమలుచేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

తనకు వయసైపోయిందంటూ వైసీపీ నేతలు పనిగట్టుకొని ప్రచారం చేస్తుండటంపై కూడా చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్రమోడీ ఇంకా దేశంలో అనేకమంది నేతలు తనవయసువారే అని అందరూ చక్కగా పాలన సాగిస్తూ చురుకుగా రాజకీయాలలో పాల్గొంటున్నారని, నేను కూడా పూర్తి ఆరోగ్యంతో ఫిట్‌గా ఉన్నానని, అందుకే నిత్యం మీ అందరి ముందుకు వస్తున్నానని చెప్పారు.

అయితే ముఖ్యమంత్రి కావాలనే ఆశతో గాక జగన్‌ పాలనలో భ్రష్టు పట్టిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టుకోవడానికే రాజకీయాలలో కొనసాగుతున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదివరకు హైదరాబాద్‌ని అభివృద్ధి చేసి చూపానని, ఆ తర్వాత అమరావతిని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంపద సృష్టించాలనుకొన్నానని, ఒకవేళ 2019 ఎన్నికలలో కూడా టిడిపి గెలిచి ఉండి ఉంటే నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరో స్థాయిలో ఉండి ఉండేదని అన్నారు.

కనుక రాబోయే ఎన్నికలలో టిడిపిని గెలిపిస్తే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి అన్నివిదాలా అభివృద్ధి చేస్తానని, తర్వాత సమర్ధుల చేతిలో పెట్టి తాను తప్పుకొంటానని అన్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిష్యత్‌, రాష్ట్ర భవిష్యత్‌ గురించి చెప్పదలచుకొన్నది విస్పష్టంగా చెప్పేశారు. కనుక ఇక ప్రజలే ఆలోచించుకోవాలి వారికి ఎటువంటి ముఖ్యమంత్రి, పాలన కావాలో!