Chandrababu Naidu comments on ys jagan వరద సహాయచర్యలు చేపట్టడంలో జిల్లా కలెక్టర్లకు నూటికి నూరు మార్కులు వేస్తానని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో స్పందిస్తూ, “కలెక్టర్లకు జగన్ రెడ్డి 100 మార్కులు వేయవచ్చు కానీ ప్రజలు మాత్రం ఆయనకు సున్నా మార్కులు వేస్తారు, “ అని అన్నారు.

శుక్రవారం చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏటపాక, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం గ్రామాలలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జగన్ రెడ్డి తనను ముఖ్యమంత్రిని చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని, ముంపు గ్రామాల ప్రజలందరికీ రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తానని ఆనాడు చెప్పారు.

ఇప్పుడు పోలవరం పూర్తిచేయలేమని, నష్టపరిహారం ఇవ్వలేనని ఎందుకంటే నోట్లు ముద్రించే మిషన్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని కాకమ్మ కధలు చెపుతున్నారు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్ రెడ్డి దానిలో నుంచి ఓ 20 వేలకోట్లు నష్టపరిహారం చెల్లించలేరా?కొంతమంది వరద బాధితులకు మాత్రమే రూ.2,000 చొప్పున ఆర్ధిక సాయం అందజేసి చేతులు దులుపుకొన్నారు.

దాంతో వారి ఇళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఆ సొమ్ము సరిపోదు. వరద బాధితులందరికీ ఆర్ధిక సాయం చేయడానికి జగన్ రెడ్డి మనసు ఒప్పదా?23 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి పోలవరం కడతానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాడు?జగన్ రెడ్డికి ఎంతసేపు సంపాదన, కేసుల గోలే తప్ప ప్రజల కష్టాలు పట్టవు. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు కట్టడం చేతకాకుంటే రాజీనామా చేసి దిగిపోతే నేను కట్టి చూపిస్తాను. మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తే పోలవరం ముంపు గ్రామలన్నిటినీ కలిపి ఓ జిల్లాగా చేసి మీ అందరి సమస్యలు తీర్చుతాను,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.