chandrababu naidu comments on tollywoodతెలుగు సినీ పరిశ్రమపై జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలతో టాలీవుడ్ వర్గాలకు పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి. విమర్శిస్తే పెట్టిన 5 రూపాయల టికెట్ కూడా ఎక్కడ ఒక్క రూపాయి అయిపోతుందెమో అన్న భయంతో టాలీవుడ్ పెద్దలు ఎవరూ నోరు మెదపని విషయం తెలిసిందే.

ఈ తరుణంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి దిక్కు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే అంటూ రాంగోపాల్ వర్మ తాజాగా ఓ టీవీ డిబేట్ లో బహిరంగంగా వ్యాఖ్యానించగా, బయటకు చెప్పినా, లేకున్నా ఇండస్ట్రీ వర్గాలది కూడా దాదాపుగా అదే మాట. అయితే ఇదంతా వైసీపీ సర్కార్ చర్యల తర్వాత భావనలు!

మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టాలీవుడ్ నుండి ప్రభుత్వానికి ఎలాంటి సహకారం లభించింది? అంటే టిడిపి అధినేత తాజాగా దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేసారు. తాను సీఎంగా ఉన్న సమయంలో తెలుగు సినీ పరిశ్రమ నుండి సహకారం అందకపోగా, తనకు వ్యతిరేకంగా సినిమాలు తీసి విడుదల చేసారని ఆవేదన వ్యక్తం చేసారు.

నిజమే… నాడు సినీ పరిశ్రమ నుండి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకువచ్చినా దానికి వెనువెంటనే ఆమోదం తెలిపి, పరిశ్రమ వర్గాలను చంద్రబాబు ప్రోత్సహించారు. ప్రస్తుత ప్రభుత్వం మాదిరి వ్యవహరిస్తే సీఎంకు వ్యతిరేకంగా తీసిన సినిమాలు విడుదల అయ్యేవా? అంతేకాదు షూటింగ్ ల నిమిత్తం అనేక ప్రోత్సాహకాలు టాలీవుడ్ కు అందించారు.

విభజనకు ముందు వరకు ఏపీలో షూటింగ్ లంటే నామమాత్రంగా ఉండేవి. కానీ విభజన తర్వాత చంద్రబాబు ఇచ్చిన వెసులుబాటుతో విశాఖ కేంద్రీకృతంగా చాలా సినిమాలు షూటింగ్ లు జరుపుకున్నాయి. ఒకప్పుడు చిన్న సినిమాలకు మాత్రమే అడ్డా అయిన విశాఖ, ఆ తర్వాత బడా చిత్రాలకు వేదిక అయ్యింది. విశాఖ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కూడా షూటింగ్ లకు నిలయంగా మారిపోయాయి.

హైదరాబాద్ లో సెటిల్ అయిపోయిన పరిశ్రమ పెట్టుబడులను విశాఖ కేంద్రంగా టాలీవుడ్ వర్గీయుల చేత పెట్టించడంలో చంద్రబాబు చూపిన చొరవను టాలీవుడ్ విస్మరించడం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడంలో తప్పు లేదేమో! నేడు జగన్ సర్కార్ తలపెట్టిన సినిమా టికెట్ల వివాదంలోకి తెలుగుదేశం పార్టీని లాగవద్దనేది చంద్రబాబు తుది మాట.