Chandrababu Naidu comments on jagan government about flood victimsఇటీవల కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం పట్టణంతో సహా సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లో గల కన్నాయిగూడెం, ఏటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడు గ్రామాలు నీట మునిగాయి. ఆ గ్రామాలల్లో కరకట్టల ఎత్తు పెంచి ముంపు నివారించేందుకు వీలుగా వాటిని తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, “హైదరాబాద్‌ను ఏపీలో విలీనం చేయమని మేము కోరితే విలీనం చేసేస్తారా?” అంటూ ఎదురుప్రశ్నించారు. అయితే నిన్న ఆ ఐదు గ్రామాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు.

ఏపీ ప్రభుత్వం తమ గ్రామాలలో సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని, తమ గ్రామాలు వరద ముంపుకి గురైతే ఇంతవరకు ఏపీకి చెందిన ఒక్క ప్రజాప్రతినిధి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 ఏళ్ళుగా తమ గ్రామాలను పట్టించుకొనే నాధుడేలేడని కనుక తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేసేయాలని వారు డిమాండ్ చేశారు.

వారి ఆవేదనపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “ప్రజలకు జగన్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్నందునే వారు ఈవిదంగా కోరుతున్నారు,” అని అన్నారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ సంక్షేమ సభలో “నేను విన్నాను…నేను చూశాను… నేను ఉన్నాను..” అంటూ సినిమా డైలాగులు చెపుతూ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఒక్క బటన్ నొక్కి ప్రజల కష్టాలన్నీ తీర్చేస్తున్నాను అన్నట్లు మాట్లాడుతుంటారు. కానీ వరద వచ్చి వారం రోజులవుతున్నా ఇంతవరకు ముంపు గ్రామాలలో పర్యటించలేదు. వరద బాధితులకు ధైర్యం చెప్పి వారికి అవసరమైన సహాయం అందించలేదు. బటన్ నొక్కి వారికి సాయం చేయలేదు. వరద బాధితులు అక్కడ నానా కష్టాలు అనుభవిస్తుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గడప గడపకి కార్యక్రమంలో పాల్గొవాలని సిఎం జగన్మోహన్ రెడ్డి చెపుతుండటాన్ని ఏమనుకోవాలి? హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే చేస్తే వరద బాధితులు ఎదుర్కొంటున్న కష్టాలు కనిపిస్తాయా? అర్దమవుతాయా?వారి సమస్యలన్నీ తీరిపోతాయా?