Chandrababu Naidu comments Narendra Modiబీజేపీ నాయకుల స్వామి భక్తి ఎల్లలు దాటుతుంది. ఆ క్రమంలో వారు సరికొత్త రికార్డులు నెలకొల్పేలా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తే ఏకంగా దేశద్రోహం కేసు పెట్టాలి అనేదాకా వచ్చారు. అసలు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు వ్యవస్థలను తిట్టడం మొదలు పెట్టారని.. అందులో భాగంగానే మోదీని కూడా తిడుతున్నారని బీజేపీ అదికార ప్రతినిధి ,సమాచార హక్కు మాజీ కమిషనర్ విజయ్‌ బాబు విమర్శించారు. చంద్రబాబుపై దేశ ద్రోహి నేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

దొంగ టెక్నీషియన్‌ హరిప్రసాద్‌ను తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని మాండ్యలో చంద్రబాబు ప్రసంగంపై చాలా అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా ఉంటే ప్రత్యక్ష నిరసనలకు దిగుతామని ఆయన తెలిపారు. మండ్యలో ఇటీవలే ఒక జేడీఎస్ ఎన్నికల సభకు హాజరైన చంద్రబాబు వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రకారం దేశం తిరోగమనంలో ఉందని చెప్పుకొచ్చారు. అది బీజేపీ నేతలకు కంటగింపుగా మారింది.

దాని మీద ఏకంగా దేశద్రోహం కేసు పెట్టేస్తారట. తమకు నచ్చితే దేశ భక్తులు, నచ్చకపోతే దేశద్రోహులను చేసేసి పాకిస్తాన్ పంపేయాలని అనుకుంటారు బీజేపీ నాయకులు. ప్రజాస్వామ్యంలో విమర్శను వినలేని వారిని నాయకులుగా ఎలా చెప్పుకుంటారో. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ వ్యాఖ్య చేసిన విజయ్‌ బాబు గతంలో జనసేనలో ఉండే వారు. అప్పట్లో టీవీ డిబేట్లలో పాల్గొని మోడీని గట్టిగానే విమర్శించే వారు. మరి అప్పటి దేశద్రోహం కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో లేక బీజేపీలో చేరాక కొట్టేశారో?