Rahul Gandhi - Chandrababu Naidu-కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో కలసి పోటీ చేశాయి. జాతీయ స్థాయి లో కలిసే ఉన్నారు..కలిసే ఉంటామని చెబుతున్నారు. కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవట. ఇప్పటికే ఈ విషయంపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వగా.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని ప్రకటించారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేస్తే పెద్దగా ఉపయోగం లేదని తెలంగాణ ఎన్నికల బట్టి అర్ధం అయ్యింది, అదే సమయంలో విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ ఎంతో కొంత చీల్చొచ్చు.

పైగా కాంగ్రెస్, వైకాపాలది ఒకే ఓటు బ్యాంకు కావడంతో విడిగా పోటీ చెయ్యడం వల్ల ప్రధాన ప్రతిపక్ష పార్టీని కొంత మేర దెబ్బ తీయ్యొచ్చని చంద్రబాబు వ్యూహం. దీనికి రాహుల్ గాంధీ కూడా ఒకే అన్నారట. అయితే దీనిని తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడానికి చూస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. కాంగ్రెస్ పార్టీనే చంద్రబాబుతో పొత్తు వద్దని నిర్ణయించుకున్నట్లు అవి ప్రచారం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉండడంతోనే కాంగ్రెస్ పొత్తు విరమించుకుందని వారు ప్రచారం చేస్తున్నారు.

నిజానికి కాంగ్రెస్ కు ఇవాల్టి రోజున ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటా అని ముందుకు వచ్చినా కాదు అనలేని పరిస్థితి. ఒంటరిగా వెళ్తే ఈసారి కూడా గుండు సున్నానే. అయితే పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లైనా గెలిచే అవకాశం ఉంటుంది. టీడీపీ గెలిస్తే కొన్ని నామినేటెడ్ పదవులు దక్కించుకుని పార్టీని కాపాడుకోవచ్చు. ఈ తరుణంలో కాంగ్రెస్ టీడీపీకి నో చెప్పిందంటే అది ఎవరూ నమ్మరు. నమ్మించే ప్రయత్నం చేస్తున్న వారికి ఆ మాత్రం రాజకీయ జ్ఞానం లేకుండా పోయిందా?