Chandrababu Naidu- calculations on Andhra Pradesh TDP Presidentతెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి నియామకం మీద మరోసారి చర్చ జరుగుతుంది. గతంలో యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు వినిపించినా తాజాగా సీనియర్ నేత అచ్చెన్నాయుడు వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. గత ఎన్నికలలో టీడీపీకి ఎల్ల వేళలా వెన్నుదన్నుగా నిలిచినా బీసీలు కొంత దూరమయ్యారని.. వారిని ఆకట్టుకునే క్రమంలో అచ్చన్నను తీసుకురావాలని చంద్రబాబు ఆలోచన.

అదే సమయంలో ఎంతో కాలంగా పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్న ఎర్రన్నాయుడు కుటుంబానికి సముచిత గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది. ప్రభుత్వం అచ్చెన్నాయుడుని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతుంటే తాము దన్నుగా నిలిచాం అనే మెసేజ్ కూడా పంపినట్టు అవుతుంది.

ముందుగా యువతను ఆకట్టుకునే క్రమంలో రామ్మోహన్ నాయుడు మేలని చంద్రబాబు భావించినా… వయసు రీత్యా రామ్మోహన్ నాయుడుకు మరి కొంత సమయం అవసరమని అభిప్రాయపడుతున్నారట. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను టీడీపీ ఇప్పటికే మండలస్థాయి వరకు దాదాపుగా పూర్తిచేసింది.

ఇకపై లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించనున్నారు. దీనిపై చంద్రబాబు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తిచేశారు. వారం, పది రోజుల్లో పార్లమెంటరీ కమిటీలను ప్రకటిస్తారని, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకం పూర్తిచేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి.