Chandrababu naidu assigns amaravati designs job to Rajamouli Chandrababu naidu assigns amaravati designs job to Rajamouli రాజధాని నిర్మాణాల ఆకృతి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాస్త ఆలస్యమైనా అదిరిపోయే ఆహర్యాలకే ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందుకే మూడున్నర్రేళ్ళ సమయం పట్టినా, ఇంకా ఒక దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారు. ఇటీవల నార్మన్ ఫోస్టర్స్ ఇచ్చిన ఆకృతిల పైన కూడా నిరుత్సాహాన్ని వ్యక్తపరిచిన చంద్రబాబు, తాజాగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.

‘బాహుబలి’ సినిమాలో అద్భుతమైన విజువల్స్ ను చూపించిన రాజమౌళి ఆలోచనలను అమరావతి పట్ల పెట్టాలని, ముఖ్యంగా ఆకృతుల విషయంలో ప్రపంచం నివ్వెరపడేలా ఉండాలని చెప్పిన చంద్రబాబు, బుధవారం నాడు ఉదయం రాజమౌళితో ఓ అరగంట పాటు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రాథమిక ఆకృతులపై చర్చించామని, రాజధాని ఆకృతులు ఎలా ఉండాలన్న విషయంలో సీఎం తన మదిలోని ఆలోచనలను పంచుకున్నారని, ఆయన దూరదృష్టి తనకెంతో నచ్చిందని, అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడం తనకు లభించిన ఓ మంచి అవకాశంగా రాజమౌళి అభిప్రాయపడ్డారు.

అయితే రాజధాని ఆకృతుల విషయంలో రాజమౌళి రంగంలోకి దిగడంతో, రాజధాని కట్టడాలు అద్భుతంగా ఉంటాయన్న అభిప్రాయంతోనో ఏమో గానీ… చంద్రబాబు – రాజమౌళిల భేటీపై సహజంగా జగన్ వర్గపు మీడియా విషం చిమ్ముతోంది. ఇదంతా కేవలం రాబోయే ఎన్నికల స్టంట్ గా అభిప్రాయ పడుతోన్న జగన్ వర్గపు మీడియా, అసలు ఇందులో పాల్గొనడం రాజమౌళికి అసలు ఇష్టం లేదని తన భావాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయడం విస్తుగొలిపే అంశం. స్వయంగా జక్కన్నే మీడియా ముందుకు వచ్చి… ఇందులో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపితే, సదరు మీడియాకు మాత్రం మరోలా వినిపించడం విశేషం.

ఓ బృందంతో త్వరలో లండన్ పర్యటన చేయనున్నానని కూడా రాజమౌళి చెప్పడంతో, అమరావతి నిర్మాణాలపై జక్కన్న ఏ మాత్రం శ్రద్ధ చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. కానీ, ఇవేమీ పట్టని జగన్ ను సమర్ధించే మీడియా మాధ్యమాలకు మాత్రం ఇదొక ‘డ్రామా’గా అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వస్తే తమ ఉనికి ఎక్కడ కోల్పోతామో అన్న ఆలోచనలలో జగన్ అండ్ కో ఉన్నారని చెప్పడానికి ఇది కూడా ఓ నిదర్శనంగా నిలుస్తోంది. గొప్ప కట్టడాలు కట్టి చూపిస్తాం అంటే… ఆహ్వానించాల్సింది పోయి, విమర్శలు చేయడం అనేది అభివృద్ధికి తాము అవరోధాలుగా నిలుస్తామని పరోక్షంగా చెప్పకనే చెప్తున్నారా?!