Chandrababu Naidu as Pro tem Speakerతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసిన అనుభవం ఉంది. ఇప్పటివరకూ ఆయన స్పీకర్ గా మాత్రం పని చెయ్యలేదు. అయితే ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం కూడా దక్కింది. కొత్త అసెంబ్లీలో సీనియర్ మోస్టు ఎమ్మెల్యే కి ప్రొటెం స్పీకర్ గా అవకాశం వస్తుంది. ప్రొటెం స్పీకర్ అంటే పూర్తిస్థాయి స్పీకర్ నియమింపబడే వరకూ తాత్కాలిక స్పీకర్ అన్నట్టు.

ఆయనే అసెంబ్లీలో కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేస్తారు. స్పీకర్ ఎన్నికను కూడా ఆయనే పర్యవేక్షిస్తారు. ప్రస్తుత సభలో చంద్రబాబు నాయుడే సీనియర్ ఎమ్మెల్యే. దానితో సంప్రదాయం ప్రకారం ఆయన ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఆయన దీనికి ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఇది అరుదైన అవమానంగానే చెప్పుకోవాలి. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే ఆ తరువాత సీనియర్ గా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఆ అవకాశం లభిస్తుంది.

175 స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 151 సీట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా 23 సీట్లతోనే సరిపెట్టుకుంది. వచ్చే ఐదేళ్ళు కష్టకాలంలో ముందుకు నడిపించి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది. ఒకపక్క జగన్, మరోపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టీడీపీని కబళించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉండటంతో ఈ ఐదేళ్ళు చంద్రబాబుకు కత్తి మీద సాము వంటిదే.